న్యూఢిల్లీ: పెన్షనర్లకు మరింత సులువుగా డబ్బు అందేలా బ్యాంకులకు, ఇతర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను జారీ చేసింది. వీటి ప్రకారం పెన్షన్‌‌ను పంపిణీ చేయడం, పెన్షనర్ల నుంచి అవసరమైన సర్టిఫికెట్లను తీసుకోవడం మరింత తేలిక కానుంది. పెన్షన్‌‌ పంపిణీ చేస్తున్న బ్యాంకుల ఛైర్మన్‌‌, ఎండీలకు ప్రభుత్వం కొత్త గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. 

డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ పెన్షన్ అండ్ పెన్షనర్స్‌‌ వెల్‌‌ఫేర్‌‌‌‌ నుంచి వచ్చిన వినతుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంది. పెన్షన్‌‌ పంపిణీ చేస్తున్న బ్యాంకులు, ఇతర సంస్థలు,  పెన్షనర్ల రిక్వెస్ట్‌‌లను తొందరగా ప్రాసెస్‌‌ చేయడంలో ఈ తాజా మార్గదర్శకాలు ఉపయోగపడతాయని సిబ్బంది శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తెలిపింది. 

ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్లు లేదా ఫ్యామిలీ పెన్షన్లను విడుదల‌ చేయడంలో బ్యాంకులు వేరువేరు విధానాలను అనుసరిస్తున్నాయి. వీటితో పాటు పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి డిక్లరేషన్‌‌ గానీ, ఇతర సర్టిఫికెట్లను తీసుకునేందుకు కూడా వేరు వేరు విధానాలను అనుసరిస్తున్నాయని డీవోపీటీ పేర్కొంది.

ప్రస్తుతం 65.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ  పెన్షనర్లు ఉన్నారు. ఫ్యామిలీ పెన్షన్‌‌ కోసం భార్య లేదా భర్త కూడా వేర్వేరుగా బ్యాంక్‌‌ అకౌంట్‌‌ను సబ్మిట్‌‌ చేయాల్సి ఉంది. 

లైఫ్‌‌, డిజబిలిటీ సర్టిఫికెట్లను పెన్షన్‌‌ తీసుకుంటున్న బ్రాంచ్‌‌కు అందించాల్సి ఉంది. పెన్షనర్‌‌‌‌ చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్లు ‘ఫామ్‌‌–14’ ను సబ్మిట్‌‌ చేయాలి. ఇలాంటి రూల్స్‌‌ అన్నింటిని కలుపుతూ ప్రభుత్వం గైడ్‌‌లైన్స్‌‌ను జారీ చేసింది. అవేమిటో ఒకసారి చూద్దాం.. 

పెన్షనర్‌‌‌‌ చనిపోతే, ఫ్యామిలీ పెన్షన్‌‌ కోసం పెన్షనర్‌‌ భార్య లేదా భర్త వేర్వేరు‌గా అకౌంట్‌‌ను సబ్మిట్‌‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ  ఈ వ్యక్తికి పెన్షనర్‌‌‌‌తో కలిసి జాయింట్‌‌ అకౌంట్ ఉండాలి.  దీంతోపాటు ప్రస్తుత ఫ్యామిలీ పెన్షన్‌‌ను తీసుకునే అధికారం ఉండాలి. ఈ సందర్భాలలో  భార్య లేదా భర్త  పెన్షనర్‌‌‌‌ డెత్‌‌ సర్టిఫికెట్‌‌ను సబ్మిట్‌‌ చేయాలి.

పెన్షన్‌‌ పేమెంట్‌‌ ఆర్డర్ ‌‌‌‌(పీపీఓ) వద్ద ఉన్న వివరాల‌ను, తమ వద్ద ఉన్న కేవైసీ ద్వారా ఫ్యామిలీ పెన్షనర్లను బ్యాంకులు గుర్తించాలి. వీరు కచ్చితంగా బ్యాంక్‌‌కు రావాలని బలవంత పెట్టకూడదు. పెన్షన్‌‌ను డిస్ట్రిబ్యూట్‌‌ చేసే బ్యాంకులు ఆధార్‌‌‌‌ ఎనబుల్డ్‌‌ డిజిటల్‌‌ లైఫ్‌‌ సర్టిఫికెట్‌‌ ‘జీవన్‌‌ ప్రమాణ్‌‌’ ను ఆమోదించాలి.

80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న పెన్షనర్లు ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్‌‌‌‌లో కూడా తమ లైఫ్‌‌ సర్టిఫికెట్‌‌ను సబ్మిట్‌‌ చేయొచ్చు. ప్రస్తుతం పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు ప్రతి ఏడాది నవంబర్‌‌‌‌లో లైఫ్‌‌ సర్టిఫికెట్‌‌ను సబ్మిట్‌‌ చేయాల్సి ఉంది.

also read:పరుగు ఆపనంటున్న పుత్తడి.. ఎకానమీనే మార్చే సత్తా

శాశ్వత వికలాంగత్వం గల పిల్లల విషయంలో కొత్తగా సర్టిఫికెట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. వికలాంగులైన పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌‌ మంజూరైతే ఆ చైల్డ్‌‌ వైకల్యం తాత్కాలికమైతే , చైల్డ్‌‌ గార్డియన్‌‌ ప్రతి ఐదేళ్లకు ఆ చైల్డ్‌‌ వికలాంగత్వ సర్టిఫికెట్‌‌ను సబ్మిట్‌‌ చేయాల్సి ఉంటుంది.

భార్య లేదా భర్త కాకుండా ఫ్యామిలీలో ఇతర సభ్యులు నాన్‌‌ మ్యారేజి లేదా నాన్‌‌ రీమ్యారేజి డిక్లరేషన్‌‌ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి. పెళ్లి చేసుకుంటే వీరికి ఫ్యామిలీ పెన్షన్‌‌ రాదు. పెన్షనర్లు తమ లైఫ్‌‌ సర్టిఫికెట్లను నవంబర్‌‌‌‌ 30 లోపు సబ్మిట్‌‌ చేసేలా బ్యాంకులు మెసేజ్​ల రూపంలో రిమైండర్లు పంపుతాయి.