Asianet News TeluguAsianet News Telugu

బేర్..బేర్‌ర్‌ర్: రూపీ నేల చూపులే.. రూపీ 70@ ప్యూచర్స్

సరిగ్గా ఐదేళ్ల క్రితం మార్కెట్ లో రూపాయి పతనాన్ని అరికట్టడంలో నాటి పాలకులు విఫలమయ్యారు. ప్రస్తుతం అదే ధోరణి కొనసాగుతున్నది. మదుపర్లు సెంటిమెంట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఒక కారణమే. ప్రపంచవాణిజ్యానికి కేంద్రమైన డాలర్ పతనం కాకుండా చర్యలు చేపట్టడం.. టర్కీలో సంక్షోభం.. అమెరికా వాణిజ్య యుద్ధభేరి ఫలితంగా రూపాయి చరిత్రలోనే గరిష్టస్థాయి పతనాన్ని నమోదు చేసి 69.93కు చేరింది.

Rupee hits fresh lifetime low as Turkey keeps investors on edge
Author
Mumbai, First Published Aug 14, 2018, 11:09 AM IST

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనీస స్థాయికి పతనం అయింది. సోమవారం ఒక్క రోజే రూ.1.10 లేదా 1.57 శాతం నష్టపోయి రూ.69.93 వద్ద ముగిసింది. ఆగస్టు 2013 తర్వాత ఒక రోజులో జరిగిన గరిష్ఠ పతనం ఇదే. అప్పుడు ఒకే రోజు రూ. 1.48 లేదా 2.4 శాతం నష్టపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాలతో వివిధ దేశాల కరెన్సీలూ పతనం అయ్యాయి. ‘లీరా’ క్షీణత ప్రభావం మన రూపాయి పైనా పడిందని ప్రభుత్వ రంగ బ్యాంకు ట్రెజరర్ ఒకరు అభిప్రాయపడ్డారు. వీటికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు తగ్గడంతోపాటు చమురు ధరల ప్రభావం కూడా రూపాయిపై ప్రభావం పడిందని అన్నారు. ప్రస్తుత మారకం విలువ మరింత పతనం కాకుండా రిజర్వ్‌బ్యాంక్ చర్యలు తీసుకుంటుందని మరో సీనియర్ ట్రెజరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సోమవారం ప్రారంభంలో రూపాయి విలువ 41 పైసలు పెరిగినా ఆ తర్వాత డాలర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో రూపాయి విలువ గణనీయంగా పతనం అయి చివరికి రూ.69.91 వద్ద ముగిసింది. కాకపోతే ప్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి విలువ అప్పుడే 70 దాటేసింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై నష్టాలతో ముగిసాయి. 

లీరా పతనం.. టర్కీ సంక్షోభం కారణాలివి:
పేరు చిన్నదైనా చాలా గొప్ప చరిత్ర కలది. ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న దేశంగా.. లౌకిక దేశంగా పేరు గడించింది. ఇవన్నీ నాణానికి ఒకవైపు.. ప్రస్తుతం టర్కీ అప్పుల ఊబిలో కూరుకున్నది. ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరింది. ఆ దేశ కరెన్సీ లిరా ఏడాదిలో సగానికి పతనమైంది. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే భారీగా పతనమైన ఆ దేశ కరెన్సీ లిరా సోమవారం అదే ధోరణి కొనసాగించింది. డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీ 12 శాతం పడిపోయింది. గత శుక్రవారం సైతం లిరా ఇదే విధంగా 16 శాతం క్షీణించడంతో ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. మన మార్కెట్లూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అమెరికా ఆంక్షలతో రష్యా కరెన్సీ రూబుల్ రెండు శాతం నష్టపోయింది. దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్ ఏకంగా ఏడు శాతం నష్టపోగా, చైనా కరెన్సీ యాన్ దాదాపు అర శాతం మేర నష్టపోయింది. జపాన్ యెన్, స్విస్ ఫ్రాంక్ మినహా మిగతా కరెన్సీ విలువలన్నీ పతనం అయ్యాయి. యూరో 13నెలల కనీస స్థాయికి పతనమైతే, పౌండ్ ఈ ఏడాది కనిష్టానికి పడిపోయింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న లీరా
మరోపక్క ప్రధాన కరెన్సీల క్షీణతకు లిరా కారణమైంది. ఈ ఏడాదిలో లిరా మొత్తం 45 శాతం క్షీణించి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడం కూడా ఒక కారణమే. టర్కీ విదేశీ రుణాలు కూడా అదుపు తప్పుతున్నాయి. టర్కీలో ద్రవ్యోల్బణం ఏకంగా 15.9 శాతానికి పెరిగింది. అధ్యక్షుడిగా ఎర్డోగాన్‌ అధికారం చేపట్టాక.. టర్కీ కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగింది. 2016లో 33.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్న లోటు.. 2017లో 47.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది కరెంట్ ఖాతాలోటు ఆదేశ జీడీపీలో 5 శాతానికి చేరుకుంది. ఎగుమతుల కన్నా దిగుమతులు పెరిగే కొద్దీ కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. 

అమెరికా సుంకాలతో గోటిచుట్టూ రోకటిపోటు
దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టర్కీ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను పెంచడంతో సంక్షోభం మరింత ముదిరింది.  ఇక టర్కీ ఆర్థిక వ్యవస్థపై అధ్యక్షుడు టయిప్‌ ఎర్డోగాన్‌ అతి జోక్యం భయపెడుతోంది. వడ్డీ రేట్లు తగ్గాలని పదే పదే పిలుపునివ్వడం, అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకూ దిగజారడం లిరా పతనానికి ఆజ్యం పోస్తున్నాయి. కరెన్సీ పతనాన్ని ఆపేందుకు టర్కీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, కేంద్ర బ్యాంక్‌ను సైతం అడ్డుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రపంచ మార్కెట్లకు తలనొప్పిగా వాణిజ్య యుద్ధాలు
గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లకు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు తలనొప్పిగా మారాయి. తాజాగా లిరా భయాలతో మార్కెట్లు మరోసారి కుదుపులకు లోనయ్యాయి. టర్కీ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోందని, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వు స్థిరంగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోండటంతో.. బాండు రాబడులు గణనీయంగా పెరిగాయి. డాలర్‌ కూడా బలపడింది. ఈ పరిణామాలు భారత్‌ సహా వర్థమాన దేశాలకు ప్రతికూలమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తాజాగా లిరా ప్రభావంతో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కరెన్సీలు భారీగా పడ్డాయి. ఒకవైపు చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వర్థమాన దేశాల్లో వడ్డీ రేట్ల పెరుగుదల, వాణిజ్య యుద్ధ భయాలతో మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

7.24కు పతనమైన లీరా
సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే లిరా రికార్డు కనిష్ఠమైన 7.24కు పడిపోయింది. మదుపర్ల ఆందోళనలు తగ్గించడానికి, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్థిక కార్యచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని, సోమవారం నుంచి వీటిని అమల్లో పెట్టామని టర్కీ ఆర్థిక మంత్రి బెరాట్‌ ఆల్బేరాక్‌ ప్రకటించడంతో కొంత ఉపశమనం లభించింది. మార్పిడి లావాదేవీలను పరిమితం చేస్తున్నట్లు టర్కీ కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ఫలితంగా ప్రస్తుతం లిరా 6.80 దరిదాపుల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు డీలాపడటంతో సురక్షిత పెట్టుబడి సాధనాలైన అమెరికా డాలర్‌, జపాన్‌ యెన్‌లు దూసుకెళ్లాయి. మదుపర్లు పసిడి వంటి వాటి వైపు మొగ్గుచూపుతున్నారు.

ద్రవ్య పాలసీలో మార్పులు తెస్తున్న వర్ధమాన దేశాలు
ట్రేడ్ వార్ నేపథ్యంలో వర్దమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీలో మార్పులు తెచ్చాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా మందగిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో వర్దమాన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ బలహీనపడతాయన్న అంచనాలతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు వర్దమానదేశాల నుంచి తరలివెళుతుండగా ఆ వేగం మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ రూపాయి మారకం విలువ రూ. 70ని దాటి మరింత పతనమైతే మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలివెళ్లే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ తుషార్ అరోరా విశ్లేషించారు. సాంకేతికంగా రూపాయి మారకం విలువ రూ. 71పతనం కావచ్చునని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విశ్లేషకుడు అనినిధ్య బెనర్జీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios