బీజింగ్: తమ వస్తు, ఉత్పత్తులపై అమెరికా మరిన్ని సుంకాలు విధిస్తే .. ప్రతీకార సుంకాలు తప్పవని చైనా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాలోకి దిగుమతి అవుతున్న చైనా వస్తు ఉత్పత్తుల్లో మరో 300 బిలియన్ డాలర్ల విలువైన వాటిపై సెప్టెంబర్ 1 నుంచి 10 శాతం టారీఫ్‌లు అమల్లోకి తెస్తామని ఈ నెల ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

దీన్ని డిసెంబర్‌దాకా వాయిదా వేస్తూ అమెరికా బుధవారం నిర్ణయం తీసుకున్నది. అయినా అమెరికాపై చైనా నిప్పులు చెరుగుతున్నది. సుంకాల భారం పెరిగితే తమ నుంచీ వడ్డింపులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు చైనాతో తాను అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటూనే ఉన్నారు. 

గత పాలకుల చేతకాని తనంతో చైనా.. అమెరికా మార్కెట్‌ను తన వ్యాపార విస్తరణకు పెద్ద ఎత్తున వాడుకున్నదని, అమెరికన్లు చైనా ఉత్పత్తుల కోసం వెచ్చించినదాన్నే ఇప్పుడు సుంకాల రూపంలో రాబడుతున్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఓ వైపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంప్రదింపులు జరుగుతున్నా మరోవైపు ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండటం చైనాకు మింగుడు పడటం లేదు.

అమెరికా విధించిన సుంకాలకు బదులుగా ఇప్పటికే తమ దేశంలోకి దిగుమతి అవుతున్న 110 బిలియన్ డాలర్ల విలువైన ఆ దేశ వస్తూత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను వేసింది. ఫలితంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. 
ఒకానొక దశలో తగ్గినట్లు కనిపించినా.. మరుక్షణమే అది తీవ్రరూపం దాల్చుతున్నది. ట్రంప్ నిర్ణయాలకు చైనా ధీటుగా బదులిస్తుండటమే ఇందుకు కారణం. ఆర్థిక, వాణిజ్యపరమైన ఘర్షణలకు సుంకాలు పరిష్కారం చూపబోవు. ఇది సరైన విధానం కాదు అని చైనా అంటున్నా.. ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన సహజశైలిలోనే కాలుదువ్వుతున్నారు. 
ఈ క్రమంలో చైనా తమ దేశంలోని అమెరికా సంస్థలపై జరిమానాలను పొడిగించడం, వారి వస్తువులకు కస్టమ్స్ క్లియరెన్స్‌లు సులభంగా ఇవ్వకపోవడం, ఆర్థిక, ఇతర రంగాల్లో లైసెన్సుల జారీలో జాప్యం వంటి చర్యలకు దిగుతున్నది. అమెరికా సైతం హువావే తదితర చైనా టెక్నాలజీ సంస్థలపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తమ నిబంధనలు, షరతులకు లోబడి చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రపంచ దేశాల గౌరవాన్ని అందుకుంటున్న ట్రంప్.. ఆ స్థాయిలో మాత్రం ప్రవర్తించడం లేదు. వివిధ దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చి అబాసు పాలవుతున్నారు. ఫలితంగా అగ్రరాజ్య పరువు, ప్రతిష్ఠలు గంగలో కలుస్తున్నాయి. దీంతో అమెరికాకు ఉన్న పెద్దన్న విలువను తగ్గిస్తూ వస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

భారత్-పాకిస్తాన్ మధ్య కశ్మీర్ అంశంలో తలదూర్చి బొప్పి కట్టించుకున్న ట్రంప్.. ఇప్పుడు చైనా-హాంకాంగ్ అంశంపైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాణిజ్య చర్చల కంటే ముందు హాంకాంగ్ నిరసనల్ని పరిష్కరించాలని చైనాకు సూచించడం ఆ దేశానికి పుండు మీద కారం చల్లినట్లు అవుతు న్నది. దీంతో మున్ముందు ఇంకేం సమస్యలు వస్తాయోనన్న భయం ఇప్పుడు అగ్రరాజ్యానికి పట్టుకున్నది.