Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు.. రంగంలోకి బ్యాంకులు

దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకోనున్నది. కొన్ని నెలలుగా రుణ వాయిదాల చెల్లింపులు, రోజువారీ నిర్వహణకు ఇబ్బందులతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు

Jet Airways debt recast: Lenders to have largest shareholding
Author
New Delhi, First Published Feb 15, 2019, 12:32 PM IST

రుణ ఊబిలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్ లైన్స్ సంస్థను కాపాడేందుకు బ్యాంకర్లు (రుణదాతలు) సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

గతేడాది ఫిబ్రవరి 12 నాటి ఆర్‌బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం.

ఈ చర్యల అనంతరం జెట్ ఎయిర్వేస్ సంస్థలో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకుంటే విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం షేర్ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు.

వివిధ బ్యాంకులకు జెట్‌ ఎయిర్వేస్‌ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. పనితీరు మెరుగు పర్చుకుని ఆదాయం పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్‌వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగం. 

బ్యాంకర్లు ప్రతిపాదించిన ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది.కాగా, జెట్‌ ఎయిర్వేస్‌కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. 

గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని సంస్థ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ మూడో త్రైమాసికంలో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది.

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే, గత ఏడాది మూడో త్రైమాసికంలో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ ఏడాది రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ సంస్థ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది.  మొత్తం వ్యయాలు రూ.6,042.58 కోట్ల నుంచి రూ.6,786.15 కోట్లకు చేరాయి.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో విమాన ఇంధన ఖర్చులు రూ.1,840.08 కోట్ల నుంచి రూ.2,387.72 కోట్లకు పెరిగాయి. విమానాలు, ఇంజిన్‌ల లీజు అద్దెలు రూ.583.67 కోట్ల నుంచి రూ.730.35 కోట్లకు చేరాయి. దేశీయ ఆదాయం రూ.2,749.05 కోట్ల నుంచి రూ.2,560.44 కోట్లకు తగ్గగా, విదేశీ కార్యకలాపాల ఆదాయం రూ.3337.15 కోట్ల నుంచి రూ.3587.54 కోట్లకు చేరింది.

గత ఏడాది మూడో త్రైమాసికంలో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ ఏడాది రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో షేరు 0.98% లాభంతో రూ.225.80 వద్ద ముగిసింది.ఇదిలా ఉంటే ప్రతిపాదించిన తాత్కాలిక రుణ పరిష్కార ప్రణాళికకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆప్‌ ఇండియా (సీసీఐ)లు అనుమతిస్తే అమలు చేస్తామని కంపెనీ తెలిపింది.

కాగా, 2018 డిసెంబర్ 31 నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌కు సంస్థలో 51 శాతం వాటా ఉండగా, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉంది. 2018 సెప్టెంబర్ నాటికి సంస్థకు రూ.8,052 కోట్ల రుణ భారం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios