Asianet News TeluguAsianet News Telugu

అ‘మంగళ’వారం: జీడీపీపై మంట+విలీనానికీ ఇన్వెస్టర్ నో.. 2.55 లక్షల కోట్ల సంపద ఆవిరి


ఐదేళ్ల కనిష్టానికి జీడీపీ పతనం.. చైనా- అమెరికా వాణిజ్యం, బ్యాంకుల మెగా విలీనం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. ఫలితంగా అమ్మకాలతో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో రూ.2.55 లక్షల కోట్ల మదుపరి సంపద బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఆవిరై పోయింది. 

Investor wealth plunges Rs 2.55 lakh crore as stocks crash
Author
New Delhi, First Published Sep 4, 2019, 11:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ/ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఆర్థిక సంక్షోభం ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. జీడీపీ పతనం, రూపాయి క్షీణత, తగ్గిన కీలక రంగాల ఉత్పాదక రేటు, పడిపోయిన వ్యాపార రంగ అమ్మకాలకు తోడు బ్యాంకుల మెగా విలీనం తదితర అంశాలు మదుపరులను భీకర పెట్టుబడుల ఉపసంహరణ వైపునకు నడిపించాయి. 

ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 769.88 పాయింట్లు లేదా 2.06 శాతం దిగజారి 36,562.91 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 225.35 పాయింట్లు లేదా 2.04 శాతం కోల్పోయి 10,797.90 వద్ద నిలిచింది. దీంతో అటు సెన్సెక్స్ 37 వేల మార్కును, ఇటు నిఫ్టీ 10,800 మార్కును చేజార్చుకోగా, రూ. 2.55లక్షల కోట్ల మదుపరుల సంపద కరిగిపోయింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 867 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్ల వరకు క్షీణించడం గమనార్హం. 

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఐదు శాతానికి పరిమితం కావడం మదుపరులకు ఏమాత్రం రుచించలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఆగస్టు నెల ఆటో అమ్మకాలూ పడిపోవడం మార్కెట్ నష్టాలకు మరో కారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోకపోవడంతో నష్టాలు మరింతగా పెరిగాయి అంటున్నారు. 

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది. ఇక సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ షేర్ల విలువ 4.45 శాతం వరకు పతనమైంది. 

ఆయా రంగాలవారీగా మెటల్, విద్యుత్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక, చమురు, గ్యాస్, నిర్మాణ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు 3.23 శాతం నష్టపోయాయి. రూపాయి విలువ నష్టంతో ఐటీ రంగ షేర్లు మదుపరులను కాసింత ఆకట్టుకుంది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థల షేర్ల విలువ ఇతర ప్రత్యర్థి సంస్థల కంటే కొంతదాకా ఎక్కువగా పెరిగింది.

బీఎస్‌ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 1.65 శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధానమైన చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలూ నష్టాలకే పరిమితమైయ్యాయి. ఐరోపాలోని కీలక సూచీలు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) షేర్లను విలీన ప్రకటన కూడా స్టాక్ మార్కెట్లను దెబ్బ తీసిన అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం పీఎస్బీ షేర్ల విలువను 10.6 శాతం మేర కుంగదీసింది. 

కెనరా బ్యాంక్ షేర్ విలువ 10.59 శాతం, యూనియన్ బ్యాంక్ 9.08 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.55 శాతం, ఓరియంటల్ బ్యాంక్ 8.10 శాతం, అలహాబాద్ బ్యాంక్ 5.67 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ 3.98 శాతం, సిండికేట్ బ్యాంక్ 1.08 శాతం చొప్పున నష్టాలను పొందాయి. 

ఐడీబీఐ బ్యాంక్ షేర్ విలువ గరిష్ఠంగా 8 శాతం వరకు పుంజుకోవడం గమనార్హం. ఆంధ్రా బ్యాంక్ షేర్ విలువ మాత్రం 0.51 శాతం లాభపడటం విశేషం. యునైటెడ్ బ్యాంక్ షేర్ విలువ కూడా 0.38 శాతం పెరిగింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మదుపరుల సంపద కూడా భారీగానే కనుమరుగైపోయింది. సెన్సెక్స్ 770 పాయింట్లు క్షీణించడంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లోని సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.2.55 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.

ఆర్థిక సంక్షోభం, వాణిజ్యపరమైన ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే విపరీతమైన అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకోగా, మదుపరుల సంపద రూ.2,55,585.56 కోట్లు పడిపోయింది. ప్రస్తుతం రూ.1,38,42,866.10 కోట్లుగా ఉన్నది.

వాహన అమ్మకాల్లో పతనం, జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, ఆశించిన స్థాయిలో ఉద్దీపన చర్యలు లేకపోవడం మార్కెట్ల నష్టాలకు దారితీశాయి అని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో అరుణ్ తుక్రల్ అన్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు మరింత పెరుగుతుండటం కూడా మదుపరులను పెట్టుబడులకు దూరం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. 

మంగళవారం ట్రేడింగ్ సందర్భంగా బీఎస్‌ఈలో 1,613 షేర్లు నష్టపోగా, 817 షేర్లు లాభపడ్డాయి. 178 షేర్ల విలువ యథాతథంగా ఉన్నది. 200లకుపైగా షేర్లు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

మంగళవారం స్టాక్ మార్కెట్ల పతనంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి క్షీణించడం ఒక కారణం. ఐదు శాతానికే పరిమితమైన జీడీపీ గణాంకాలుదేశ ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టేలా నమోదు కావడం మదుపరులను తీవ్రంగా భయపెట్టింది.

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. ఒక్కరోజే 97 పైసలు పడిపోయి 72 మార్కుకు దిగువన నిలిచింది. 72.39 వద్ద స్థిరపడింది. ఈ పరిణామం మదుపరుల పెట్టుబడులను భారీగా అడ్డుకున్నది. దీంతో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపారు.

స్టాక్ మార్కెట్ల లాభాలకు కీలక రంగాల మందగమనం కూడా గండి కొట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మాంద్యం ప్రభావం.. ముఖ్యమైన తయారీ రంగాన్ని దెబ్బ తీస్తున్నది. జూలైలో 8 కీలక రంగాల్లో ఉత్పాదక రేటు 2.1 శాతానికి దిగజారింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి పడిపోయాయి.

విదేశీ మదుపరులు (ఎఫ్‌ఐఐ లేదా ఎఫ్‌పీఐ) తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం.. మార్కెట్లను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వీరిని ఆకట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో పెట్టుబడులు రూ.లక్షల కోట్లలో తరలిపోతున్నాయి.

ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడి కూడా స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. దాదాపు రెండు దశాబ్దాల స్థాయిలో వాహన విక్రయాలు క్షీణించడం, బ్యాంకుల రుణ వృద్ధి మందగించడం ఈ రంగాల షేర్లకు మదుపరులను దూరం చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios