సామాన్యులపై ధరల భారం...రెవెన్యూ పెంపు కోసం జీఎస్టీలో భారీ మార్పులు..?

ఇప్పటికే డిమాండ్ లేక.. సరుకులు అమ్ముడు పోక లాభాలు పెంచుకునేందుకు వివిధ సంస్థలు తమ వస్తువుల ధరలు పెంచేస్తున్నాయి. కేంద్రం తమకు ఆదాయం లేదనే పేరుతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్దీకరణ పేరుతో కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచనున్నది. శ్లాబ్ లను కుదించనున్నది. అదే జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు విమానం మోత మోగించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 

GST Council meet next week: Tax rates of various items likely to go up

న్యూఢిల్లీ: చలికాలంలోనూ ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ సమయంలో సామాన్యులపై ధరా భారాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెవెన్యూ లోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతం అవుతున్నది.

దీంతో జీఎస్టీ రేట్లు పెంచేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే శ్లాబులను కుదించే అవకాశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చేవారం అంటే ఈ నెల 18న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం ఈ నెల 18న జరుగనున్నది. ఒకవైపు జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టడం, మరోవైపు రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడం వంటి పరిస్థితుల్లో జీఎస్టీ సమావేశం జరుగనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. 

also read  పేటీఎం వ్యవస్థాపకుడి రాజీనామా...తన రాజీనామా లేఖలో...

2017 జూలైలో అమలులోకి వచ్చిన జీఎస్‌టీ చట్ట హయాంలో పన్ను రేట్లను నాలుగు శ్లాబులుగా (5, 12, 18, 28 శాతం) విభజించారు. విలాస వస్తువులు, సిగరెట్లు, గుట్కా వంటి అనారోగ్యకర ఉత్పత్తులపై ప్రభుత్వం 28 శాతం పన్నుకు అదనంగా ఒకటి నుంచి 25 శాతం వరకు సుంకం కూడా వసూలు చేస్తోంది. 

ఆర్థిక మందగమనంతోపాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్‌టీ వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో అదనపు వనరుల కోసం పన్ను రేట్లు పెంచడం తప్ప మరోమార్గం లేదని మోదీ సర్కారు భావిస్తోంది.  కాగా, జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సిఫారసు చేయాల్సిన అంశాలకు తుదిరూపు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్రాల అధికారులు రెండు రోజుల క్రితం ఢిల్లీలో సమావేశం అయ్యారు.

ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లలో ఐదు శాతం శ్లాబ్‌ను 8 శాతానికి, 12 శాతంగా ఉన్న శ్లాబ్‌ను 15 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు వినికిడి. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రజంటేషన్ కూడా ఇస్తారని తెలుస్తోంది. పలు వస్తువులపై విధిస్తున్న సెస్ కూడా పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. 

బడ్జెట్ అంచనాల మేరకు జీఎస్టీ వసూళ్లు రాక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య సీజీఎస్టీ వసూళ్లు ఏకంగా 40 శాతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు జీడీపీ వృద్ధిరేటు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 4.5 శాతానికి జీడీపీ పడిపోయింది. ఇది 26 త్రైమాసికాల కనిష్టం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునే మార్గాలపై సూచనలు చేయాలని కేంద్ర రాష్ట్ర అధికారులు గల జీఎస్టీ కమిటీకి జీఎస్టీ కౌన్సిల్ లేఖలు రాసింది.

జీఎస్టీలో 5 శాతం పన్ను పెంచడంతోపాటు 12 శాతాన్ని 18 శాతం శ్లాబులో విలీనం చేసే ప్రతిపాదననూ పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు శ్లాబులను మూడుకు కుదించినట్లవుతుంది. 12 శాతాన్ని విలీనం చేయకుంటే 18% పన్ను రేటును సైతం 22-25% వరకు పెంచవచ్చని వినవస్తోంది. 

పన్ను ఆదాయ లోటు భర్తీకి రాష్ట్రాలు అధిక పరిహారం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులపై 28 శాతం పన్ను అదనంగా విధించే సుంకాన్ని సైతం పెంచడంపై సమావేశంలో చర్చించవచ్చు. ప్రస్తుతం పన్ను మినహాయింపు లభిస్తున్న వస్తువుల జాబితానూ పునః సమీక్షించి కొన్నింటిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

GST Council meet next week: Tax rates of various items likely to go up 

కొన్ని సేవలపై సుంకం విధించాలన్న ప్రతిపాదననూ పరిశీలించవచ్చు. నెలకు జీఎస్‌టీ వసూళ్లను కనీసం రూ.1.20 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల దిగువకే పరిమితం అయ్యాయి. సెప్టెంబరులోనైతే 19 నెలల కనిష్ఠ (2018 ఫిబ్రవరి నాటి) స్థాయికి జారుకున్నాయి. పండగ విక్రయాల దన్నుతో నవంబరులో మాత్రం రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటగలిగాయి.
 
సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్టీ) వసూళ్లు బడ్జెట్‌ అంచనాల కంటే 40 శాతం తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో గడిచిన 8 నెలల్లో (ఏప్రిల్‌-నవంబర్) సీజీఎస్టీ వసూళ్లను రూ.5.26 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వాస్తవానికి వసూలైంది రూ.3.28 లక్షల కోట్లే. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఇదే కాలానికి వసూళ్లు రూ.4.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
 
జీఎస్‌టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం గరిష్ఠ పన్ను శ్లాబుకు అదనంగా పరిహార సుంకం వసూలు చేస్తోంది. పరిహారం పెంచాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత నెలలో సుంకం వసూళ్లు రూ.7,720 కోట్లకు తగ్గాయి.

అదనపు వడ్డింపులతో నెలవారీ సుంకం ఆదాయాన్ని రూ.10,000 కోట్ల వరకు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2020 ఏప్రిల్‌ నుంచి నెలకు కేంద్రం పంచాల్సిన పరిహార మొత్తం రూ.21 వేల కోట్ల పెరగనుంది. ఇక కనిష్ఠ పన్ను శ్లాబు (5 శాతం) రేటును ఒక శాతం పెంచితే ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల మేర పెరగవచ్చని అంచనా. 

ఒకవేళ జీఎస్టీని 8 శాతానికి పెంచితే, అదనంగా రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అయితే, ఈ శ్లాబ్‌ రేటును పెంచితే నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆహారోత్పత్తులు, పాదరక్షలు, సామాన్యులు ఉపయోగించే వస్త్రాలన్నీ ఈ శ్లాబ్‌ పరిధిలోకే వస్తాయి. ఈ జాబితాలోకి టీ, కాఫీ, కిరోసిన్‌, బొగ్గు, శీతలీకరించిన కూరగాయలు, మసాలా దినుసులు, రస్క్‌, ఔషధాలు, సోయాబీన్‌ తదితరాలు వస్తాయి.

also read ఎస్బీఐ మొండిబకాయిలలో అవకతవకలు...నిజాన్ని బయటపెట్టిన ఆర్‌బి‌ఐ...మొత్తం ఎన్ని కొట్లో తెలుసా ?

ఇంకా ఇడ్లీ, దోశ పిండి, వంటనూనెలు, అగ్గిపెట్టెలు, స్కిమ్మ్‌డ్‌ మిల్క్‌ పౌడర్‌, బ్రాండెడ్‌ పనీర్‌, పల్లీలు, స్టీల్‌ ఉటెన్సిల్స్‌, వస్త్రాలు, ఖాదీ నూలు, రూ.1000లోపు పాదరక్షలు, ఇన్సులిన్‌, ఎరువులు, అన్‌ బ్రాండెడ్‌ ఆయుర్వేదిక్‌, యునానీ, సిద్ధ, హోమియోపతి ఔషధాలు, ఈ-బుక్స్‌, సోలార్‌ విద్యుత్‌ యంత్రం, ఎలక్ట్రిక్‌ వాహనాలు, దివ్యాంగులు ఉపయోగించే తోపుడు యంత్రాలపై ఐదు శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తున్నారు.
 
ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి (జీఓఎం) ఇకపై బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటివరకు సీతారామన్‌ ఈ జీఓఎంకు అధ్యక్షత వహించారు. 

ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ శ్లాబ్‌ రేటు పరిధిలో 243 వస్తువులు ఉన్నాయి. ఈ శ్లాబ్‌ను 18 శాతంలో విలీనం చేస్తే గనుక ఈ వస్తువులన్నింటిపై పన్ను రేటు నికరంగా 6 శాతం పెరగనుంది. 12 శాతం పన్ను రేటును 15 శాతానికి పెంచినట్లయితే, మరో 3 శాతం అదనపు భారం పడనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios