భారతీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో స్టార్టప్‌ల పాత్రపై అన్ని వైపులా అభినందనలు వ్యక్తం అవుతున్నా.. వాటికి సమస్యలు, ఇబ్బందులు తప్పడం లేదు. దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో అవసరమైన పెట్టుబడులను సేకరించడం కోసం కష్టకాలం ఎదుర్కొంటున్న తరుణంలో తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కోరుతున్నారు. ఈ క్రమంలో వారి కష్టనష్టాలను ఒకసారి పరిశీలిద్దాం..

దేశంలో ఏటా కనీసం కోటి కొత్త ఉద్యోగాలు అవసరం. ప్రభుత్వం, కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యమే. ఈపీఎఫ్‌ఓ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 89.7లక్షల కొత్త ఉద్యోగాలే వచ్చాయి. ఈ ఆర్థిక ఏడాదిలోనూ వాస్తవంగా కావాల్సిన ఉద్యోగాలకంటే.. 16లక్షల వరకూ తక్కువే ఉండొచ్చనని అంచనా. 

ఈ నేపథ్యంలో ఉద్యోగాలను సృష్టించేందుకు స్టార్టప్‌లు కీలకంగా మారాయి. గత ఐదారేళ్లుగా ఇవే యువతకు ప్రధాన ఉద్యోగాధారంగా అవతరించాయి. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం రోజుకు 10కి పైగా కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి.

Also Read:స్వామినాథన్ సిఫారసుల అమలుతో రెండేళ్లలో రెట్టింపు ఆదాయం పక్కా..

‘స్టార్టప్‌ ఇండియా.. స్టాండప్‌ ఇండియా’ అనే నినాదం భారత ప్రధాని నరేంద్రమోదీకి ఎంతో ఇష్టమైంది. స్టార్టప్‌లకు నూతన జవసత్వాలు కల్పించి, తద్వారా దేశ యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దీన్ని మొదలు పెట్టారు. 

కానీ, ఆశించిన మేర బడ్జెట్‌ కేటాయింపులు జరగడంలేదు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇస్తే గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని స్టార్టప్ రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

గ్రామాల నుంచి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల లభ్యత పెద్ద ఇబ్బందిగా మారుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని, వారికోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు ముఖ్యంగా గ్రామాల్లో ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేసే స్టార్టప్ సంస్థలకు ఈ నిధి తోడ్పడాలి. 

పాఠశాల, కళాశాలల స్థాయిలోనే విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానం, ప్రోత్సాహం కలిగించేలా ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించాలి. కార్యాలయ స్థలాలకు అధిక అద్దెలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కో- వర్కింగ్‌ కార్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాలి. 25 ఏళ్లలోపు వారు ప్రారంభించే స్టార్టప్ సంస్థలకు హామీలేని రుణాలు, గ్రాంటులు లభించేలా బడ్జెట్‌లో ఏదైనా ప్రతిపాదనలు చేయాలని కోరుతున్నారు.

రైతుల సమస్యలపై అధికంగానే దృష్టి సారిస్తూ, వారికోసం ఎంతో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఆహార ఉత్పత్తులు, వాటిని ప్రాసెసింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలి. నాబార్డ్‌లాంటి సంస్థలు వీరికి రుణాలు ఇచ్చేలా చూడాలి. 

ప్రభుత్వం రైతుల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే స్టార్టప్ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి. ఇలాంటి వాటికి అందించే యంత్రాలపై రాయితీ లేదా తక్కువ వడ్డీ రుణాలను ఇస్తే బాగుంటుందని అవర్ ఫుడ్ స్టార్టప్ అభిప్రాయ పడుతోంది. 

స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెరిగే దిశగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలి. స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధులు అందేలా చూడాలి. అందుకోసం వీటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐటీ, ఇతర నిబంధనలను కాస్త సరళతరం చేయాలి. ఎంపిక చేసిన స్టార్టప్ సంస్థలకు ప్రభుత్వమే తొలి వినియోగదారు కావాలి.

అదే సమయంలో వారికి బిల్లులూ సకాలంలో చెల్లించాలి. ప్రాథమిక స్థాయిలో నిధులను అందించేందుకు ఒక ప్రత్యేక ఏర్పాటు ఉండాలి. పలు ప్రభుత్వ శాఖలు తమ విభాగాల్లో ‘ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’లను నిర్వహించి, సృజనాత్మకంగా ఉన్న సంస్థలు వెలుగులోకి రావడానికి తోడ్పాటునందించాలి. వీటికి గ్రాంటులను అందించి ప్రోత్సహించాలని కోరుతున్నారు.

స్టార్టప్ సంస్థలను ప్రారంభించేవారికి కొన్ని నిబంధనలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎన్నో అనుమతులు తీసుకున్నా.. ఒకటి తక్కువే అవుతోంది. ఐఐఎంలు, ఐఐటీల్లో చదివిన వారికీ, కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసి సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నవారికీ ఈ నిబంధనలు చిక్కుముడులుగా మారుతున్నాయి.

స్టార్టప్ సంస్థలకు ఒకే చోట అనుమతులు ఇచ్చేలా ఏదైనా ఏర్పాటు చేయాలి. రూ.2కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సంస్థలకు నిబంధనలను సరళీకృతం చేయాలి. ఎవరైనా స్టార్టప్‌ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా అమ్మేయడం చేసినప్పుడు వారు మరో స్టార్టప్ సంస్థలో పెట్టుబడి పెడితే.. పన్నుపరమైన ప్రయోజనం కల్పించాలి.

సమాజంపై ప్రభావం చూపే స్టార్టప్ సంస్థల నిర్వాహకులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం కల్పించాలి. కార్పొరేట్‌ సంస్థలు.. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఖర్చు చేసే మొత్తంలో కొంత ఇలాంటి స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టేలా బడ్జెట్‌లో ప్రతిపాదించాలి. 

స్టార్టప్ సంస్థలు ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా.. వాటికి ఆదాయపు పన్ను, జీఎస్టీ కింద కొన్ని మినహాయింపులు కల్పించాలి. ఏంజెల్‌ ఇన్వెస్టర్లకు మూలధన రాబడిపై పన్ను విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలి. దీనివల్ల వారు ఒక స్టార్టప్ నుంచి మరో స్టార్టప్ సంస్థలోకి తమ పెట్టుబడులు మార్చుకునేందుకు వీలుంటుందఃని పేర్కొంటున్నారు.

ఆదాయం పన్ను పరిమితి విషయంలో ఐటీ యాక్ట్ 80సి పరిమితిని కనీసం రూ.2.5 లక్షలకు పెంచాలని, లేదంటే స్కూలు ఫీజులకు ప్రత్యేక మినహాయింపు కల్పించాలన్న అభ్యర్థనలు పెరిగాయి. దీనికి కొన్నాళ్లుగా ఫీజులు బాగా పెరగడమే కారణం. ఇటీవల డిపాజిటు రేట్లు బాగా తగ్గాయి. 

మధ్యతరగతి ప్రజల్లో పొదుపు అలవాటును పెంచాలంటే డిపాజిటు రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని స్టార్టప్ సంస్థల నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. తక్కువ రేట్లకు వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చేలా దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని, మరిన్ని జన్‌ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అభ్యర్థిస్తున్నారు.

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతోపాటు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను రేటు ఉండేలా చూడాలి స్టార్టప్ ల వ్యవస్థాపకులు కోరుతున్నారు. 

Also Read:budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...

ఆదాయం పన్ను చట్టం 80 సీ కింద ప్రస్తుతం ఇస్తున్న పరిమితిని రూ.1.50 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు, గృహ రుణం కోసం చెల్లించే వడ్డీ పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలి. స్టాండర్‌ డిడక్షన్‌ను రూ.లక్షకు పెంచాలి.

వ్యవసాయ, పాడి రంగాలకు నిధులు కేటాయించి ప్రోత్సాహకాలు పెంచాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు చేయూతనివ్వాలి. నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ తగ్గించి సేవల మీద పెంచాలి. ప్రజలపై ఎటువంటి భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బడ్జెట్‌లో చర్యలు చేపట్టాలని విశాఖ డెయిరీ అసిస్టెంట్ మేనేజర్ మాధవ స్వామి తెలిపారు. 

భూగర్భజలాల్లో, చెరువులు కలుషితం అవ్వడంతో పట్టణాలు, గ్రామాల్లో ఎక్కువ మంది నీటి శుద్ధి చేసిన ఆర్‌ఓ నీళ్లే వాడుతున్నారు. పేదవాళ్లు, రోజు కూలీలు డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరం. వాళ్ల జీవనానికి ఇది అదనపు భారం. అందుకే శుద్ధి నీటిని నామమాత్ర రుసుంతో అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆర్‌ఓ ప్లాంట్లపై జీఎస్‌టీని తగ్గించాలని కోరుతున్నారు.