స్వామినాథన్ సిఫారసుల అమలుతో రెండేళ్లలో రెట్టింపు ఆదాయం పక్కా..

2019 వార్షిక బడ్జెట్​లో వ్యవసాయ రంగ నిధుల్లో 75 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 10వేల ఫార్మర్​ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. 

Budget 2020: Doubling farmer income, becoming $5 trillion economy would be key focus areas

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక ప్రగతి మందగమనంలో సాగుతోంది. ఇందుకు వినియోగ డిమాండ్ తగ్గిపోవడమే  ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రామాల్లో వస్తు సేవల డిమాండ్ బాగా తగ్గిపోయింది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేక ఇదుకు ప్రధాన కారణం. దేశంలో సుమారు 50% మంది వ్యవసాయం ప్రధాన ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కనుక వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు.

2019 వార్షిక బడ్జెట్​లో వ్యవసాయ రంగ నిధుల్లో 75 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 10వేల ఫార్మర్​ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. రైతులకు ఉపయోగపడే వీటి ఏర్పాటు వేగవంతం చేయాలని విశ్లేషకులు అంటున్నారు. 

వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకూ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్​ చాలా కాలంగా వినిపిస్తోంది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్థానంలో కొత్త బీమా, పరిహార పథకం తేవాలని.. ఇది కాకుంటే ఫార్మర్స్ డిజాస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. తొందరగా పాడయ్యే పంటలను నిల్వ చేసుకోవటానికి ప్రభుత్వమే అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

గ్రామాల్లో డిమాండ్​ పెరిగినప్పుడు సరఫరా తగ్గడం వంటి సమస్యలను అధిగమించేందుకు ఇవి ఉపయోగపడుతాయని నిపుణులు అంటున్నారు. వీటి ద్వారా రైతులతో పాటు వినియోగదారులకూ మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదలను నియంత్రించవచ్చని వారి మాట. వీటికి సంబంధించి సహకార సమాఖ్యలనూ ప్రోత్సహించవచ్చని  అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014 ఎన్నికల మానిఫెస్టోలోనే ప్రకటించింది. ఈ మేరకు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది కూడా. అయితే పండించేందుకు చేసిన ఖర్చుపై 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనికోసం పటిష్ట చట్టాన్ని తేవాలని రైతు సంఘాల నుంచి డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. 

వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల పురోగతికి గత బడ్జెట్లలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2019 మధ్యంతర బడ్జెట్​లో రైతులకు సంవత్సరానికి పీఎం-కిసాన్ సమ్మాన్ అనే పేరుతో రూ.6,000 పంపిణీకి నాంది పలికింది. ఇందుకు కేంద్రం రూ.75వేల కోట్లను కేటాయించింది. 

పీఎం-కిసాన్ సమ్మాన్ పథకంలో ఇప్పటి వరకు సగం నిధులు కూడా ఖర్చు చేయలేదని నిపుణులు అంటున్నారు. అల్ప స్థాయిలో ఇది ఉపయోగపడినా.. దీనికి కేటాయింపులు పెంచాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతుల సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులతో పాటు రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచితే వారి వద్ద కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి బడ్జెట్​లో ప్రభుత్వం భారీగానే చర్యలు తీసుకోనుందని విశ్లేషకులంటున్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు పెంచే అవకాశం ఉందని వారు తెలిపారు. 

ఈ సారి బడ్జెట్​లో జాతీయ వ్యవసాయ ఎగుమతుల విధానం ప్రకారం చర్యలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటికి కేటాయింపులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో ఒక శాతం ఉన్న కార్పొరేట్లకు రూ.1.45 లక్షల కోట్ల మేర రాయితీలు ఇచ్చినట్లే, వ్యవసాయ రంగానికి రాయితీలు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. వీటి ద్వారా రైతుల ఆత్మహత్యలు నియంత్రించడం వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. రైతుల రుణాల విషయంలో కేరళ తరహా రుణ విమోచన చట్టం అవసరమని విశ్లేషిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios