న్యూఢిల్లీ: కీలక అంశాల పరిష్కారానికి దృష్టి సారించకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్‌ (బ్యాడ్‌ బ్యాంక్‌) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు ఉదయ్‌ కొటక్‌ పేర్కొన్నారు. 

‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్‌ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

‘ఇక బ్యాడ్‌ బ్యాంక్‌ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని కొటక్‌ ఉదయ్ తెలిపారు.

గతంలో ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్‌ అసెట్స్‌ స్థిరీకరణ ఫండ్‌ (ఎస్‌ఏఎస్‌ఎఫ్‌) ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఉదయ్ కోటక్ ప్రస్తావించారు.

2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్‌పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

మొండిబాకీల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్‌ కొటక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

also read గుడ్ న్యూస్..ఇక పై మరింత చౌకగా ఎస్‌బి‌ఐ రుణాలు...

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఉదయ్ కొటక్‌ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉదయ్ కొటక్‌ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు.

కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్‌ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని ఉదయ్ కొటక్‌ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు.

ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని ఉదయ్ కొటక్‌ తెలిపారు. 

ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని ఉదయ్ కొటక్ చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్‌మెంట్లు ఉండాలని కొటక్‌ సూచించారు.

దేశ జీడీపీ పెరగడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. అదికూడా కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్దీపనలు ప్రకటిస్తేనే సాధ్యమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) వృద్ధిరేటు పోయినట్లేనని స్పష్టం చేశారు.