Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

All Eyes on Sitaraman's Second budget for Tax Relief
Author
Hyderabad, First Published Jan 2, 2020, 4:17 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ మూహూర్తం దగ్గర పడింది. వచ్చే బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏమైనా వరాలు కురిపిస్తారా? ఆదాయం పన్ను తగ్గిస్తారా? అన్న అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె తన రెండో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం.. మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోతను గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో బడ్జెట్లో పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతేడాది జూలై ఐదో తేదీన ప్రవేశ పెట్టిన తన తొలి బడ్జెట్‌లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కించే చర్యలేవీ లేవనే మాట అప్పట్లో బాగా వినిపించింది. దీనికి సమాధానమే లేదంటే ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతోనో మొత్తానికి సెప్టెంబర్ నెలలో కార్పొరేట్‌ పన్ను ఆమె బాగా తగ్గించారు. ఈ ఒక్క నిర్ణయంతో ఖజానాపై రూ.1.45 లక్షల కోట్ల మేర ప్రభావం పడనుంది.

also read కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

మరోవైపు 2019లో చాలా వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ప్రభుత్వం తగ్గించింది. స్థిరాస్తి, విద్యుత్‌ వాహనాలు, హాస్టల్‌ వసతి, వజ్రాల తయారీ, ఔట్‌డోర్‌ కేటరింగ్‌ లాంటివి ఇందులో ఉన్నాయి. జీఎస్టీ, కార్పొరేట్‌ పన్నును తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో నెమ్మదించిన వినియోగం కారణంగా పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది. 

మరోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు కూడా నిరాశ పరుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోతున్నది. ఫలితంగా రెవిన్యూ లక్ష్యాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే జీఎస్టీ రేట్లను పెంచాలని కేంద్రం భావించగా, డిసెంబర్‌లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టాలు దీన్ని వ్యతిరేకించడంతో కేంద్రం ముందుకెళ్లలేకపోయింది. 

All Eyes on Sitaraman's Second budget for Tax Relief

ఈ నేపథ్యంలో ఆదాయ వనరులుగా ఉన్న పన్నులను మరింత తగ్గించే సాహసం మోదీ సర్కారు చేయకపోవచ్చన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఆదాయ లక్ష్యాలను సాధించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. అయితే ఈ విషయాలపై పెద్దగా ఆలోచన చేయని సామాన్యులు మలి విడుత మోదీ ప్రభుత్వం తమకూ పన్నుల వరాలు ప్రకటిస్తుందనే ఆశతో ఉన్నారు. 

కార్పొరేట్లకు కార్పొరేట్‌ పన్ను, స్టార్టప్ సంస్థలకు ఏంజెల్‌ ట్యాక్స్‌, వ్యాపారులకు జీఎస్‌టీ, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై విధించిన సర్‌ఛార్జీ మళ్లీ ఉపసంహరించుకోవడం.. ఇలా అందరికీ ప్రోత్సాహకాలు అందించినప్పుడు తమకు పన్ను తగ్గిస్తే బావుంటుదని వేతన జీవులు కోరుకుంటున్నారు.

also read విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి... కోర్టు గ్రీన్ సిగ్నల్

గత బడ్జెట్లో సంవత్సరానికి రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించనక్కర్లేదనే ప్రతిపాదన చేశారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ఏడాదికి రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. ఇప్పుడు మరిన్ని ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత మందగమన పరిస్థితులు, ఇప్పటికే తగ్గించిన పన్నులతో ఆదాయంపై పడుతోన్న భారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం వేతనజీవులకు పన్నులు తగ్గించకపోవచ్చనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. 

అదే సమయంలో వినియోగం నెమ్మదించినందున ఆదాయం పన్ను తగ్గిస్తే మరింత డబ్బు వ్యవస్థలోకి వచ్చి వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున పన్ను కోత దిశగా నిర్ణయం తీసుకోవచ్చని మరికొందరు అంటారు. నిర్మలా సీతారామన్‌ మొగ్గు ఎటు వైపో చూడాలి మరి.

Follow Us:
Download App:
  • android
  • ios