హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కాలుష్యం సంగతి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మరోవైపు వాహనాల సంఖ్య 60 లక్షలు దాటింది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక వ్యక్తిగత వాహనాల వినియోగం కాస్త తగ్గినా ఆశించిన స్థాయిలో లేదు. నెమ్మదిగా ఈ పరిస్థితి మారనుంది. ఎందుకంటే.. మరో నెల రోజుల్లో సిటీ రోడ్లపై 309 ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. దీని వల్ల వాతావరణ కాలుష్య స్థాయి కొంత తగ్గుతుందని భావిస్తున్నారు.. 

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఎలక్ట్రిక్‌ బస్సులను గరిష్ట సంఖ్యలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా(ఫేమ్‌)’ పథకం రెండోదశ అమలుకు శ్రీకారం చుట్టింది.

తదనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ పంపిన ప్రతిపాదనల మేరకు కేంద్రం 334 బ్యాటరీ బస్సులను మంజూరు చేసింది. గతంలో ఇదే పథకం కింద నగరానికి వంద బ్యాటరీ బస్సులను మంజూరు చేసినా 40 మాత్రమే వచ్చాయి. అన్నీ ఏసీవే కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్నారు. 

ఇప్పుడు వచ్చే 334 బస్సుల్లో 309 బస్సులను జంటనగరాల్లో సిటీ బస్సులుగా వాడతారు. మిగతా బస్సులను వరంగల్‌లో నడపాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ కొంతకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. నిధులు లేమి వంటి సమస్యలు ఉన్నాయి. 

దాదాపుగా మనంతే జనాభా ఉన్న బెంగళూరులో 6,500 బస్సులుంటే, సిటీలో వాటి సంఖ్య 3,600. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో పరిస్థితి కొంచెం మెరుగుపడనుంది. ఏసీ బస్సులకు పెద్దగా ఆదరణ లేని నేపథ్యంలో నాన్‌ ఏసీ బస్సులే తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. తొలిసారిగా నగరంలో నాన్‌ ఏసీ బ్యాటరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ఇంతకుముందులాగే ఈసారి కూడా అద్దె ప్రాతిపదికనే తీసుకోనున్నారు. 

ఒక్కో బ్యాటరీ బస్సు ధర రూ.1.75 కోట్లు. గతంలో తీసుకున్న ఏసీ బస్సు ధర రూ.2.50 కోట్లు. అప్పట్లో కేంద్రం ఒక్కో బస్సుకు రూ.కోటి (33 శాతం ధర) చొప్పున రాయితీ ప్రకటించింది. ఇప్పుడు తీసుకునే నాన్‌ ఏసీ బస్సుకు రూ.50 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ఖరీదైన ఈ బస్సులను కొనటం కష్టంగా మారింది. 

దీంతో ఆ రాయితీని ప్రైవేటు సంస్థలకు మళ్లించి వాటి నుంచి అద్దె ప్రాతిపదికన బస్సులను సమకూర్చుకుంటోంది. ఫలితంగా వాటి నిర్వహణ, డ్రైవర్‌ ఖర్చులన్నీ ప్రైవేటు సంస్థే భరిస్తుంది. కిలోమీటర్‌కు నిర్ధారిత మొత్తం చొప్పున ఆర్టీసీ ఆ సంస్థకు రుసుము చెల్లిస్తుంది.