రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం.. ప్రత్యేకించి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను వాడాల్సిన అవసరం ఉన్నదని 87 శాతం మంది ప్రతినిధులు పేర్కొన్నారు. క్లైమేట్ ట్రెండ్స్‌పై ఫోర్త్ లయన్ టెక్నాలజీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారంతా కాలుష్య నియంత్రణకు విద్యుత్ వాహనాలనే కొనాలని సూచించారు.

గత నెల 21 - 24 తేదీల మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో 2,178 మంది డ్రైవర్లు, వాహనాల యజమానులు పాల్గొన్నారు. వచ్చే పదేళ్లలో సొంతంగా వాహనం కొనుగోలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్న డ్రైవర్లు, యజమానులు విద్యుత్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 

భారతదేశంలోని ఏడు నగరాల పరిధిలో వాయు కాలుష్యానికి వాహనాలు విడుదల చేస్తున్న 24 శాతం కర్బన ఉద్గారాలు ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని 20 అత్యధిక కాలుష్య కారక నగరాల్లో 14 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయని తెలుస్తున్నది. 

దీనికి తోడు వాయు నాణ్యత దెబ్బ తినడంతో పలువురు డ్రైవర్లు, యజమానులు వ్యక్తిగతంగా దెబ్బ తిన్నట్లు చెప్పారు. రమారమీ 76 శాతం మంది ఇరుగుపొరుగు వారు తమ ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్ల ప్రతి రోజు వాయు నాణ్యత పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీ నగరం అత్యధికంగా 91 శాతం వాయు నాణ్యత దెబ్బ తిన్నదని తేలింది. హైదరాబాద్ లో 78 శాతం, చెన్నై 75, ముంబై 74, బెంగళూరు 71, కోల్‌కతాలో 70 శాతం వాయు నాణ్యత దెబ్బ తిన్నదని సర్వేలో తేలింది. 

జీరో కర్బన ఉద్గారాలను వెలువరించే విద్యుత్ వాహనాలే బెటరని 72 శాతం మంది డ్రైవర్లు, వాహనాల యజమానులు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ వాహనాలకు అతిపెద్ద మూడో మార్కెట్‌గా నిలిచింది భారత్. 2017లో కంబూస్టన్ ఇంజిన్  వాహనాలు 40 లక్షలకు పైగా విక్రయించారు. వాటిలో మోటార్ బైక్ లు 81 శాతం (20 మిలియన్ల యూనిట్లు) ఉన్నాయి. 

విద్యుత్ వాహనాల కొనుగోలు పట్ల ప్రజల్లో ఆసక్తి పెంపొందించడానికి చాలా ఆరోగ్యకరమైన అవేర్ నెస్ కలిగించాల్సిన అవసరం ఉన్నదని ఈ సర్వే సంకేతాలిచ్చింది. అయితే విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నదని 59 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం కరంట్ బ్యాటరీ ప్యాక్ నుంచి విద్యుత్ చార్జింగ్ వైపు మళ్లించాల్సి ఉందంటున్నారు.