న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా తన పేరొందిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ ఎకోస్పోర్ట్‌ 2019 ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త హంగులు, ఫీచర్లతో కూడిన కొత్త ఎకోస్పోర్ట్‌ ధరలను గత ఏడాది ఎడిషన్‌తో పోలిస్తే రూ.8,300 నుంచి రూ.57,400 వరకు తగ్గించింది. 

పెట్రోల్‌, డీజిల్‌ ఆప్షన్లలో లభించే 2019 ఎడిషన్‌ ఎకోస్పోర్ట్ కార్ల ధర శ్రేణి రూ.7.69- 11.33 లక్షల స్థాయిలో ఉంది. థండర్‌ ఎడిషన్‌లో పెట్రోల్‌ వేరియంట్‌ రూ.10.18 లక్షలు, డీజిల్‌ వేరియంట్‌ రూ.10.68 లక్షలకు లభించనుంది. 

పెట్రోల్‌ వేరియంట్‌లో 1.5 లీటర్‌, 1 లీటర్‌ ఎకోబూస్ట్‌ ఇంజన్‌ ఆప్షన్లలో, డీజిల్‌ వేరియంట్లు 1.5 లీటర్‌ ఇంజన్‌తో అందుబాటులో ఉంటాయని ఫోర్డ్ పేర్కొంది. గతేడాది మోడల్ కారుతో పోలిస్తే ఈ ఏడాది ‘ఎకోస్పోర్ట్’ ట్రిమ్‌గా ఉంటుందని ఫోర్డ్ వివరించింది. 

అంతేకాదు కార్ల తయారీలో మార్కెట్ లీడర్ మారుతి సుజుకి కంపాక్ట్ మోడల్ కారు విటారా బ్రెజ్జా, టాటా మోటార్స్ వారి నెక్సాన్, హోండా డబ్ల్యూ -ఆర్వీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కార్లకు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఈ కార్ల ధరలు కూడా రూ.6.48 -రూ.11.99 లక్షల మధ్య పలుకుతున్నాయి. 

ఫోర్డ్ ఇండియా మేనేజ్మెంట్ కూడా సంస్థను పూర్తిగా లోకలైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సమర్థవంతమైన ప్రొడక్ట్ డెవలప్ మెంట్ టీంతో లోకలైజేషన్ చర్యలు చేపట్టామని ఫోర్డ్ ఇండియా అద్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. తాము కేవలం కస్టమర్ల అవసరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయా కార్ల విలువ పెంచడానికి చర్యలు చేపడుతున్నామని అనురాగ్ మెహ్రోత్రా అన్నారు. 

ఫోర్డ్ ఇండియా 2019 ఎడిషన్ మోడల్ ఎకో స్పోర్ట్ మోడల్ కారు న్యూ స్పోర్టీ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, రేర్ వ్యూ మిర్రర్స్, డ్యూయల్ టోన్ బాయ్ నెట్, డెకల్స్ ఆన్ డోర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన హ్యుండాయ్ ‘వెన్యూ’ మోడల్ కంపాక్ట్ కారు తరహాలోనే ఎకో స్పోర్ట్ కారులో ఫీచర్లను తీర్చి దిద్దారు.