ముంబై: సంప్రదాయ పద్ధతుల నుంచి క్రమంగా యూత్ ఆకాంక్షలకు అనుగుణంగా కంపాక్ట్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, సెడాన్ల ఉత్పత్తిలో ముందు ఉన్న టాటా మోటార్స్‌ తాజాగా మరో ఉత్పత్తిని మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఏడాది సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు హారియర్‌ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే కారు కోనుగోళ్ల బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. పుణెలోని చకన్‌ కర్మాగారంలో ఉత్పత్తికి ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ కారును ఓఎంఈజీఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నట్లు పేర్కొంది. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టెక్నాలజీ ఆధారంగా కేవలం ఆరునెలల్లోనే అభివృద్ధి చేశారు. జీప్‌ కంపాస్‌, హుందాయి టక్సన్‌కు పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకురానుంది.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ విభాగం అధ్యక్షుడు మయాంక్‌ పరేఖ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ మేము బుకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ సిద్ధమైంది. దీనిని 2019 నుంచి డెలివరీ చేయడం ప్రారంభిస్తాం. మేము హెచ్‌5ఎక్స్‌ కాన్సెప్ట్‌ను ప్రదర్శించినప్పటి నుంచి కస్టమర్లు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ కారు కొత్త ట్రెండ్‌ను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు.

ఫైవ్‌స్పోక్‌ అలాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ లైట్లతో ఉన్న రెండు రంగుల ఓఆర్‌వీఎం, ఫ్లోటింగ్‌ రూఫ్‌ డిజైన్‌, షార్క్‌ ఫిన్‌ యాంటీనా, రూఫ్‌పై అమర్చే స్పాయిలర్‌, బ్యాక్ సైడ్ ప్రత్యేక డిజైన్‌తో ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. బీఎస్‌- నిబంధనలకు అనుకూలంగా ఉన్న 2.0లీటర్‌ క్రోటెక్‌ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను అమర్చారు. ఇది 140 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో సిక్స్‌-స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌బాక్స్‌, హుండాయి నుంచి తీసుకొన్న సిక్స్‌-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందజేస్తున్నారు.