Asianet News TeluguAsianet News Telugu

ఈవీకి మారాలంటే ‘ఆధార్’ప్రింట్ కాదు.. నీతి ఆయోగ్‌కు బైక్స్ సంస్థల ఘాటు రిఫ్లై


సంప్రదాయ వాహనాలను విద్యుత్ వినియోగం వైపు మళ్లించాలంటే ఆధార్, కార్డులు ప్రింట్ చేసినంత సులభం కాదని నీతి ఆయోగ్‌కు మోటార్ బైక్స్, స్కూటర్స్ తయారీ సంస్థలు టీవీఎస్, బజాజ్, హీరో మోటో కార్ప్స్ ఘాటుగా జవాబిచ్చాయి. ఇటీవల రెండు వారాల్లో విద్యుత్ వాహనాల దిశగా మారేందుకు ప్రణాళికలు సమర్పించాలని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలను నీతి ఆయోగ్ కోరిన సంగతి తెలిసిందే.

'Changing to electric 2-wheelers from conventional mode not like Aadhaar, printing cards'
Author
New Delhi, First Published Jun 25, 2019, 10:13 AM IST

న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు మండి పడ్డాయి. ఇదేమీ ఆధార్‌ కార్డును ప్రింట్‌ చేసింత ఈజీ కాదని, కేవలం సాఫ్ట్ వేర్ మార్పు మాత్రమే కాదని టీవీఎస్, బజాజ్‌ ఆటో వ్యాఖ్యానించాయి.  నీతి ఆయోగ్ చేసిన ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి.

‘ఇది ఆధార్‌ కార్డు కాదు. సాఫ్ట్‌వేర్, ప్రింట్‌ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’ అని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్‌ నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్‌ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్‌ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్‌ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.  

‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలు అవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’ అని టీవీఎస్ మోటార్స్ కంపెనీ చైర్మన్ అండ్ ఎండీ వేణు శ్రీనివాసన్‌ తెలిపారు.

2 కోట్ల వాహనాలు, 15 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని టీవీఎస్ మోటార్స్ కంపెనీ చైర్మన్ అండ్ ఎండీ వేణు శ్రీనివాసన్‌ చెప్పారు. థర్మల్‌ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యం తగ్గదని స్పష్టంచేశారు.

కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టు ఉన్నదని టీవీఎస్ మోటార్స్ కంపెనీ చైర్మన్ అండ్ ఎండీ వేణు శ్రీనివాసన్‌ అన్నారు. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన వాహనాల వినియోగ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. విద్యుత్ వాహనాల వినియోగం విషయమై ఆచరణాత్మక, అన్ని భాగస్వామ్య పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. 

150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్‌ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 

150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. విద్యుత్ వాహనాలను వినియోగంలోకి తేవాలన్న ప్రతిపాదనపై భాగస్వాములందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని హీరో మోటో కార్ప్ సూచించింది.

ఎలక్ట్రిక్‌ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్‌ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios