వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 


న్యూఢిల్లీ:యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధినేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. వై.ఎస్. షర్మిల తన భర్త అనిల్ తో కలిసి గురువారంనాడు ఉదయం ఎఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

Scroll to load tweet…

 కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలను ఉపయోగించుకొనే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ తెరపైకి వచ్చింద.ఈ విషయమై రాహుల్ గాంధీ,సోనియా గాంధీలతో వై.ఎస్ షర్మిల చర్చించారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయని షర్మిల అప్పట్లో ప్రకటించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరికను వ్యతిరేకించారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో వై.ఎస్. షర్మిల ద్వారా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది.

వైఎస్ఆర్‌సీపీ లో అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. నిన్న తాడేపల్లికి వై.ఎస్. షర్మిల వచ్చిన సమయంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడ ఆమెతో పాటు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు జగన్. ఈ తరుణంలో టిక్కెట్టు దక్కని వైఎస్ఆర్‌సీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం సాగుతుంది.