వైద్య సదుపాయాలు ఎంతగా మెరుగవుతున్నా అడవిని నమ్ముకునే బ్రతికే గిరిజనులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. రాళ్లు రప్పలు , కొండకోనలు, పైరు పంటలు, అత్యవసర పరిస్థితులు వచ్చిన ప్రతిసారి దిక్కులు పిక్కటిల్లేలా ఘోషిస్తున్న అడవి తల్లుల అరణ్యరోదనకు ఇవే ప్రత్యక్ష సాక్షాలు అవుతున్నాయి.

ఇంటి ఇల్లాలుకు నెలలు నిండి ఒక్కసారిగా పురిటి నొప్పులవచ్చి బిడ్డ  మెలితిరుగుతుంటే ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం నడకదారి లేక.  గూడెం లోని జనాలు అంతా ఒక్కటవుతున్నారు.

తాళ్లతో డోలికట్టి ఆమెను డోలి లో కూర్చోబెట్టి కాలినడకన కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వాగులు వంకలు కొండలు గుట్టలు దాటుకుంటూ వెళుతుండగా చివరికి మార్గమధ్యంలోనే ప్రసవమైన దాఖలాలు అనేకం వున్నాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ సాలూరు మండలం ఎం చింతలవలస గ్రామంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం. తమకు పట్టు పరుపులు, పందిరి మంచాలు, మదర్‌కిట్లు అడగటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ బిడ్డలకు కాలి బాటలే జన్మస్థలాలు కాకుండా చూడండని అడవి తల్లులు ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలోని ఎం చింతలవలస గ్రామంలో జోబి , ముత్తయమ్మ  దంపతులు జీవిస్తున్నారు.

నిండు గర్బిణీ అయిన భార్యకు పురిటి నొప్పులు రావడంతో కాన్పు కోసం శంబర ఆరోగ్య కేంద్రానికి బయల్దేరారు. కొండపై ఉన్న చింతలవలస గ్రామము నుండి దుప్పటిని డోలిగా చేసి అందులో భార్యను కూర్చోబెట్టి బంధువులు, గ్రామస్తుల సాయంతో సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందా గ్రామానికి కాలినడకన బయల్దేరారు.

నాలుగు కిలోమీటర్ల పాటు వాగులు వంకలు, కొండలు గుట్టలు దాటి అతి కష్టం మీద ముత్తయమ్మ తీసుకువస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో నడిరోడ్డు మీదే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో బొడ్డు పపేగును వేరు చేయడానికి వారికి రోడ్డు పక్కనవున్న రాళ్లరప్పలే దిక్కయ్యాయి.

అనంతరం తల్లిబిడ్డలను ఇంటికి తీసుకెళ్లామని, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలిపారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తర్వాత పాలకులు, అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో వీరి ఆవేదన అరణ్య రోదనే అవుతోంది. 

 

"