హైదరాబాద్: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 

మేడా మల్లికార్జునరెడ్డి తోపాటు పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికల్లో తానే రాజంపేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

టికెట్ ఇస్తానని అధినేత జగన్ స్పష్టం చేసినట్లు తెలిపారు. గతంలో అమర్ నాథ్ రెడ్డి, తాను కలిసి పనిచేశానని అలాగే 2019లో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నానన్నారు. 

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాలవారికి చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను నమ్మం బాబు నమ్మం అంటున్నారని చెప్పారు. తనకు ఏ పదవులు అక్కర్లేదని ఎమ్మెల్యేగానే పోటీ చెయ్యాలన్నదే తన లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ కడపజిల్లాలో ఒకే ఒకడిగా టిడిపికి గౌరవం తెచ్చిన ఎమ్మెల్యేగా ఉంటే తనను సస్పెండ్ చెయ్యడం బాధాకరమన్నారు. 

ఆరోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే మాట చెబుతున్నాం కాబోయే సీఎం జగన్మోహన్‌ రెడ్డేననన్నారు. రాష్ట్రంలో దోపిడీ జరుగుతోందని ఆ దోపిడీని అరికట్టాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల మేరకు పరిపాలన రావాలంటే బడుగుబలహీన వర్గాలకు ఆదరించే సిఎంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. 

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలిచ్చిందని అందులో భాగంగానే 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని జగన్ చెప్పినట్లు చెప్పారని తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలన్నదే తన లక్ష్యమని అందులో భాగంగా స్పీకర్ ఫార్మెట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ సూచన మేరకు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశానని మేడా మల్లి కార్జునరెడ్డి తెలిపారు. 

ఈనెల 22నే ప్రభుత్వ విప్‌ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రైతాంగాన్ని, డ్వాక్రామహిళలను, నిరుద్యోగ యువతను, కాపులను అందర్ని చంద్రబాబు మోసం చేయడం జరిగిందని ప్రజలు గమనించాలని మేడా కోరారు. చంద్రబాబు ఇస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మెుద్దు అని కోరారు.

ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరే కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఇంచార్జ్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గైర్హాజరుకావడం విశేషం. మేడా మల్లికార్జునరెడ్డి రాకను అమర్ నాథ్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మేడాకు సహకరించేది లేదని తాడో పేడో తేల్చుకుంటామని ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

"

ఈ వార్తలు కూడా చదవండి

అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తా, రాజంపేటను గెలిపిస్తా : మేడా మల్లికార్జునరెడ్డి

మేడాకు సహకరించను, నాకు టికెట్ ఇవ్వండి..వైసీపీ నేత

మేడా ఎఫెక్ట్: తాడోపేడో అంటున్న అమర్‌నాథ్ రెడ్డి

రాజంపేట టిక్కెట్టు: బాబును కలిసిన తానా అధ్యక్షుడు వేమన సతీష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు