కడప:  కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చింది. రెడ్ బస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజును తెరమీదికి టీడీపీ తీసుకొచ్చింది.  రాజంపేటకు చెందిన పార్టీ నేతలతో సీఎం చంద్రబాబునాయుడు  ఈ నెల 22వ తేదీన  సమావేశం కానున్నారు. ఈ తరుణంలో చరణ్‌రాజు పేరు తెరమీదికి రావడం ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది.

పార్టీ మారేందుకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారనే  ప్రచారం సాగుతున్న తరుణంలో  రెడ్‌బస్ వ్యవస్థాపకసభ్యుడిగా ఉన్న  చరణ్ రాజు టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పొట్లదుర్తిలో సీఎం రమేష్‌ను చరణ్‌రాజు కలిశారు.

రాజంపేట నియోజకవర్గానికి చెందిన నేతలతో చంద్రబాబునాయుడు రేపు సమావేశం కానున్న నేపథ్యంలో  చరణ్ రాజు  సీఎం రమేష్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అయితే మల్లిఖార్జున్ రెడ్డి  వైసీపీలో చేరితే చరణ్‌రాజును ఈ స్థానం నుండి బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. 

రాజంపేట అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మేడా మల్లిఖార్జున్ రెడ్డి విజయం సాధించారు. అయితే కొంత కాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీలో  మల్లిఖార్జున్ రెడ్డి చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

తాను పార్టీ మారుతున్నట్టుగా సాగుతున్న ప్రచారాన్ని  మల్లిఖార్జున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మల్లిఖార్జున్ రెడ్డి ప్రకటించారు.ఈ నెల 22వ తేదీన చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన అమరావతిలో సమావేశం కానున్నారు. మల్లిఖార్జున్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ నెల 20వ తేదీన  రాజంపేటలో నిర్వహించిన  పార్టీ సమావేశానికి మల్లిఖార్జున్ రెడ్డి హాజరుకాలేదు.

ఈ సమావేశానికి మల్లిఖార్జున్ రెడ్డికి ఆహ్వానం పంపినా కూడ  హాజరుకాలేదని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. కానీ తనకు ఆహ్వానమే అందలేదని మల్లిఖార్జున్ రెడ్డి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు