కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను సీఎం చెయ్యడమే తమ అంతిమ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన దాదాపు 2000 మందితో ఈనెల 31న వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు వెళతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నిర్ణయంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించినట్లు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుంటే కార్యకర్తలంతా తన వెంట ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవర్ని పెట్టినా కలిసి పనిచేస్తామని తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి వైఎస్‌ జగన్‌కు కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, మోసాలను ప్రజలు గమనిస్తున్నారని మేడా తెలిపారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటంటూ మేడా మల్లికార్జునరెడ్డి ధ్వజమెత్తారు.