అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయ సాయిరెడ్డికి మరో కీలక పదవి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ పక్ష నేతగా సీఎం జగన్ నియమించారు. అంతకు ముందు ఏపీ ఒలింపిక్ అసోషియేషన్ చైర్మన్ గా విజయసాయిరెడ్డిని నియమించారు. 

తాజాగా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూఉత్తర్వులు జారీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్‌రావు పనిచేశారు. కేబినెట్ మంత్రి హోదాతో ఆయన బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తన పదవికి రాజీనామా చేశారు.