అక్క చెల్లెమ్మలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జగనన్న జీవ క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
అమరావతి: అక్క చెల్లెమ్మలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జగనన్న జీవ క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు.
2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ గురువారం ఈ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
ఒక్కో యూనిట్‌లో 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలతో పాటు (తల్లి నుంచి వేరు చేసిన 5–6 నెలల వయసు) యవ్వనపు పొట్టేలు లేదా మేకపోతు (మొత్తం 14+1) ఉంటాయి. రవాణా, బీమా వ్యయం కలుపుకుని ఈ యూనిట్ ఖరీదు రూ.75 వేలుగా నిర్ణయించారు.
గొర్రెలలో నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల బ్రౌన్, విజయనగరం జాతులు, మేకలలో బ్లాక్ బెంగాల్, లేదా స్థానిక జాతులతో నచ్చిన జీవాన్ని లబ్ధిదారులు కొనుగోలు చేయవచ్చు.
ఒక్కో లబ్ధిదారునికి ఒక యూనిట్ మాత్రమే పంపిణీ చేస్తారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లానా ఫుడ్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మాంసం, మాంస ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే ఆసక్తి గల ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తుంది.
నాణ్యమైన ప్రాసెస్ చేసిన మాంసాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అల్లానా ఫుడ్స్ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో ఓ కేంద్రం ప్రారంభించింది. అంతేకాదు కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరిన్ని శాఖలను విస్తరించే యత్నాలు చేస్తోంది.
జీవాల పెంపకం ద్వారా భూమి లేని నిరుపేద మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఈ పథకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జీవాల మాంసానికి ఎలాంటి అవరోధాలు లేకుండా అధిక ప్రొటీన్లు కలిగి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
జీవాల పెంపకానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా అధిక లాభాలను పొందవచ్చు. పెంపకందారులకు వాణిజ్య పరంగా మంచి భవిష్యత్ ఉంటుంది. జీవాలలో పునరుత్పత్తి ప్రక్రియ వేగంగా ఉండటం వల్ల మంద వేగంగా, తక్కువ సమయంలో అభివృద్ధి చెందుతుంది.
తద్వారా త్వరగా లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవాల మూత్రం, పేడ పంట పొలాలకు శ్రేష్టమైన ఎరువుగా ఉపయోగపడి.. సేంద్రీయ వ్యవసాయానికి తోడ్పడుతుంది.
ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. నిర్ధిష్టమైన విధివిధానాల మేరకు సెర్ప్ ఆప్షన్ ఇచ్చిన అక్క చెల్లెమ్మలు, ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్ ప్రతినిధి, బ్యాంకు ప్రతినిధి సంబంధిత లబ్ధిదారునితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ధారించిన ధరకు రైతు భరోసా కేంద్రం లేదా సంత వద్దకు వెళ్లి జీవాలను తనిఖీ చేస్తారు.
కొనుగోలు చేసిన జీవాలకు గుర్తింపు కొరకు చెవిపోగులు వేస్తారు. మూడేల్ల పాటు బీమా సౌకర్యం కల్పిస్తారు. మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటి విడత 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడత 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడత 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 10, 2020, 10:58 AM IST