చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కామాంధుల కారణంగా వికలాంగురాలైన మైనర్ బాలిక ప్రాణాలు గాలిలో కలిశాయి. బంగారుపాళ్యంలో ముగ్గురు వ్యక్తులు బాలికపై అత్యాచారం చేశారు.

ఆ తర్వాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. లైంగికంగా వేధిస్తూ వచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక విషం సేవించింది. ఆమెను రుయా ఆస్పత్రిలో చేర్చారు. అయితే, రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది.నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణమైన హత్య జరిగింది. ఓ మహిళను ఓ యువకుడు రెండు కత్తులతో విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. 

రక్తస్రావం తీవ్రంగా జరగడంతో ఆమె మృత్యుకౌగిట్లోకి వెళ్లిపోయింది. నిందితుడు హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కుమారుడితో కలిసి నిత్యం మద్యం సేవిస్తుండడంతో ఆమె మందలించినట్లు తెలుస్తోంది. అలా మద్యం సేవించకూడదని చెప్పినందుకు విజయవాడలోని రెడ్డిగారి తోటకు చెందిన మహిళను అతను హత్య చేశాడు.

హత్య చేసిన సమయంలో నిందితుడు మద్యం మాత్రమే కాకుండా గంజాయి కూడా సేవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ మత్తులోనే మహిళను అతను హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య ఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.