లోక్ సభలో ఇవాళ కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్లు 2025 కు ఆమోదం లభిచింది. అసలు ఈ బిల్లు ఏమిటి? ఇది అమలులోకి వస్తే ఏం జరగనుంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్ 2025 బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లు గురించి మాట్లాడుతూ... దేశ రక్షణను దెబ్బతీసేలా, జాతీయ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించేవారికి దేశంలోకి అడుగు పెట్టనివ్వబోమని ఆయన స్పష్టం చేసారు. ఎవరుపడితే వారు ఎప్పుడుపడితే అప్పుడు రావడానికి దేశం ఏమీ ధర్మశాల కాదని అమిత్ షా అన్నారు.
''ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండటానికి ఇది ధర్మశాల కాదు. ఎవరు వస్తున్నారు, ఎప్పుడు, ఎందుకు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారో తెలుసుకునే హక్కు దేశానికి ఉంది. దేశ భద్రతకు భంగం కలిగించకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారికి తామే సాదరంగా ఆహ్వానిస్తాం. కానీ దేశ రక్షణకు ఆటంకం కలిగించేవారికి ఎట్టి పరిస్థితుల్లో దేశంలో అడుగు పెట్టనివ్వబోము'' అని అమిత్ షా స్పష్టం చేసారు.
'ఈ బిల్లు దేశంలోని చాలా సమస్యలకు సంబంధించింది. దీని ద్వారా భారత్‌కు వచ్చే విదేశీయుల వివరాలు నమోదు చేస్తారు. ఇది దేశ భద్రత, అభివృద్ధికి సహాయపడుతుంది' అని అమిత్ షా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి, వ్యాపారం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ఈ బిల్లు చాలా ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
భారత్‌లోకి ప్రవేశించడానికి సరైన పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి.
నకిలీ పత్రాలు ఉపయోగిస్తే కఠిన శిక్షలు.
వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటే చర్యలు.
దేశ భద్రతకు అవసరం.
ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్లు 2025 గురించి మాట్లాడుతూ సీఏఏ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు అమిత్ షా. 'పార్సీలు భారత్‌లో ఆశ్రయం పొందిన చరిత్ర ఉంది. ఇప్పటికీ వారు ఇక్కడ సురక్షితంగా ఉన్నారు. ప్రధాని మోదీ పాలనలో బీజేపీ ప్రభుత్వం పొరుగు దేశాల నుంచి వేధింపులకు గురైన ఆరు వర్గాల వారికి సీఏఏ ద్వారా ఆశ్రయం కల్పించింది' అని అన్నారు.
'గత 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. భారత్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులు ఇక్కడికి రావడం సహజం. కానీ దేశ వ్యవస్థకు తోడ్పాటు అందించడానికి వచ్చే వారికి స్వాగతం ఉంది. కానీ రోహింగ్యా లేదా బంగ్లాదేశీయులు అశాంతి సృష్టించడానికి వస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని అమిత్ షా హెచ్చరించారు.
ఈ బిల్లు ద్వారా దేశ భద్రతను నిర్ధారించడం, విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించడం, భారతదేశ అభివృద్ధికి బలం చేకూర్చడం ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. ఇకపై దేశంలోకి అక్రమ వలసలను నిరోధించడానికి ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారెనర్స్ బిల్లు 2025 ఉపయోగపడుతుందని అమిత్ షా అన్నారు.