vuukle one pixel image

జగన్ పాలనలో అవమానాలే... వచ్చే ఐదేళ్లూ అందరికీ రాజపూజ్యం: ఉగాది వేడుకల్లో చంద్రబాబు | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 30, 2025, 6:00 PM IST

పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని.. అందులో భాగంగానే P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీటీడీ పంచాంగం సహా వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ పంచాంగాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. "భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. చరిత్రను మర్చిపోతే మనం ఉనికి కోల్పోతాం. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగ శ్రవణం. షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి. నాకు ఇంకా గుర్తుంది. చిన్న వయసులో రచ్చబండపై గ్రామస్తులంతా కూర్చుని ఉగాది శ్రవణం వినేవాళ్లం. మన సంప్రదాయాలు మరిచిపోకూడదనే ఉద్దేశంతో తెలుగు భాష, కళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పక్కన అవధాన కేంద్రం , అన్నమయ్య క్షేత్రం, శిల్ప కళా వేదిక ఏర్పాటు చేశాం. ఢిల్లీ ఏపీ భవన్, చెన్నై పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌లో ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం." "ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. కేవలం 25 ఏళ్లలోనే అమెరికన్ల కంటే రెండింతలు ఆదాయం సంపాదించింది మన తెలుగువారే అయినందుకు నాకు గర్వంగా ఉంది. నేనూ, ప్రధాని మోదీ, మిత్రులు పవన్ కల్యాణ్ ఆలోచించేంది ఒకటే. మన రాష్ట్రం, దేశం బాగుండాలని. ప్రపంచంలో మనదేశం అగ్రస్థానంలో ఉంటే, దేశాన్ని నడిపించే శక్తి తెలుగుజాతికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ని కోరకుంటున్నాను." "గత ప్రభుత్వ పాలనలో ఆ ఐదేళ్లూ రాష్ట్రం కళ తప్పింది. అందరం కూర్చుని సంతోషంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు నా సుధీర్ఘ రాజకీయ అనుభవంలో ఏనాడు చూడలేదు. అన్నీ చిక్కుముడులే. ఒక్కో చిక్కుముడిని విడదీస్తూ వ్యవస్థను సరిచేస్తున్నాం. ఈ ఏడాది రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం. ప్రజల ఆదాయం పెరగాలి. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి." "ఆనాడు నేను హైటెక్ సిటీ నిర్మించాను. ఐటీని ప్రమోట్ చేశాను. దీంతో వేలాది మంది ఐటీ నిపుణులు పుట్టుకొచ్చారు. వారంతా దేశ, విదేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డారు. వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. నాడు ఐటీ ప్రమోట్ చేశాను. నేను ఏఐ, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఆనాడు నేను సెల్ ఫోన్లను ప్రమోట్ చేస్తే దాన్ని కూడా కొందరు ఎగతాళి చేశారు. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే మనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే సెల్ ఫోన్‌ను సక్రమంగా వినియోగించుకుంటే జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. వ్యసనంగా మారితే మాత్రం సమస్యలు వస్తాయి." "సంపద కొందరికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఎన్టీఆర్, మహాత్మాగాంధీ, అంబేద్కర్ సహా ఎవరూ పుట్టుకతోనే గొప్పవారిగా పుట్టలేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. నేడు ఉగాది పర్వదినాన మార్గదర్శి- బంగారు కుటుంబం జీరో పావర్టీ-పీ4కు శ్రీకారం చుట్టాను. సంపన్నులు పేదలను ఆదుకోవాలి. వారిని ఆర్ధికంగా పైకి తేవాలి. అందరికీ విద్య, వైద్యం అందాలి. స‌మాజంలో ఉన్న‌త స్థానంలోని 10 శాతం మంది... స‌మాజంలో అట్ట‌డుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాల‌ను ఆదుకుని వారి ఆర్థిక అభ్యున్నతికి స్వ‌చ్ఛందంగా ముందుకువచ్చి సహకరించాలి. దాతృత్వంలో మన తెలుగువాళ్లు ప్రపంచానికే ఆదర్శం కావాలి." "ఈ 9 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్స్ ఫస్ట్ నినాదంతోనే పాలన సాగిస్తున్నాం. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి అందిస్తూనే మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాం. గతంలో నేను ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాను. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాగఫణి శర్మను 30 ఏళ్లుగా చూస్తున్నానని... అయితే ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డుల ప్రదానం చేశారు. 86 మంది కళారత్న అవార్డులు, 116 మంది ఉగాది అవార్డులు అందుకున్నారు.