పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ ఆ దేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలు చేపడుతోంది. తాజాగా భారత ఆర్మీకి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవానును పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా బంధించింది.
India Pakistan Conflict : ఇప్పటికే భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు లేవు... ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య విబేధాలు ముదిరాయి. తాజాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ హస్తం ఉందని భారత్ బలంగా వాదిస్తోంది. దీంతో ఆదేశంపై అనేక ఆంక్షలు విధించగా... పాక్ కూడా భారత్ పై ఆంక్షలు విధించింది. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.
భారత్, పాక్ సరిహద్దుల్లో గస్తీకాస్తున్న ఇండియన్ ఆర్మీ జవాన్ ను పాక్ కిడ్నాప్ చేసింది. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బార్డర్లో గస్తీకాస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవానుని పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్ వ్యవసాయ భూమి దగ్గర రొటీన్ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది.
అయితే పాకిస్థాన్ తమ భూభాగంలో రావడంవల్లే ఈ జవాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతోంది. భారత్ మాత్రం అక్రమంగా బంధించారని అంటోంది. ఏదేమైనా తమ జవాన్ విడిచిపెట్టాలని పాక్ ను భారత్ కోరింది... లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది.
పాక్ ఆర్మీ బంధించిన భారత జవాన్ ను విడిపించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇరువైపులా వెంటనే చర్యలు చేపట్టారు. బిఎస్ఎఫ్ మరియు పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు జెండా సమావేశం ద్వారా సంప్రదింపులు ప్రారంభించారు. పాక్ అదుపులో ఉన్న సైనికుడిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి దౌత్య మరియు సైనిక మార్గాలను ఉపయోగిస్తున్నారు.
పాకిస్తాన్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నామని... జవానుని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై ఆశాభావంతో ఉన్నామని భారత సైన్యం హామీ ఇస్తోంది. ఈలోగా ఫిరోజ్‌పూర్ నుండి భారత వైపు ఉన్న ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
పాక్ ఆర్మీచేతిలో బంధీగా ఉన్న పికే సింగ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడిని ఎలాగైన పాక్ చెరనుండి కాపాడాలని బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నవేళ ఆర్మీ జవాన్ ను బంధించడం పరిస్థితిని మరింత సీరియస్ చేస్తోంది.