భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణనకు అమెరికా కృషి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ విషయాన్ని అందరికంటే ముందుగా ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ మరోసారి భారత్, పాకిస్థాన్‌ల వ్యవహారంపై స్పందించారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. తాను భారత్, పాకిస్తాన్ నాయకులతో కలిసి "వెయ్యేళ్ల తర్వాత అయినా" కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ వేదికగా ఈ పోస్ట్ చేశారు. "వెయ్యేళ్ల తర్వాత అయినా కాశ్మీర్‌పై ఒక పరిష్కారానికి రాగలమో చూద్దాం. భారత్, పాకిస్తాన్ నాయకులకు శుభాకాంక్షలు. మీ నిర్ణయం వల్ల ఎంతో మానవ నష్టాన్ని నివారించగలిగాం" అని ట్రంప్ చెప్పారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య వాతావరణం క్రమంగా వేడెక్కుతోన్న నేపథ్యంలో అమెరికా చురుకువగా వ్యవహరించింది. యుద్ధ ముంచుకొస్తుందని అమెరికాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు.
ఆ తరువాత ట్రంప్‌ను కూడా సమాచారం ఇచ్చినట్లు సీఎన్‌ఎన్ నివేదిక తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ (NCA) సమావేశం ఏర్పాటు చేశారని వార్తలు వచ్చినా, రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మాత్రం అలాంటి సమావేశమే లేదని స్పష్టం చేశారు.
ట్రంప్ నుంచి ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే భారత DGMOకి పాకిస్తాన్ DGMO ఫోన్ చేసి మధ్యాహ్నం 3:30 గంటలకు కాల్ చేసి సాయంత్రం 5 గంటల నుంచి ఫైర్ ఆపుతామని ఒప్పుకున్నట్టు తెలిపింది. కానీ కాల్పుల విరమణ నిర్ణయం ఎక్కువసేపు నిలవలేదు. శనివారం సాయంత్రం పాకిస్థాన్ కాల్పులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లో అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్‌పురా సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులకు దిగిందని, నాలుగు డ్రోన్లను భారత బలగాలు కూల్చేశాయని వార్తలు వచ్చాయి.
ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా భారతదేశం, పాకిస్తాన్‌కు శాంతి, అభివృద్ధి వస్తుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. “ఇది చారిత్రాత్మకంగా, ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. నా దేశం ఇలాంటి శాంతి ఒప్పందానికి సహకరించినందుకు గర్వంగా ఉంది. ఇరుదేశాలతో ట్రేడ్‌ను మరింతగా పెంచుతాను” అని ట్రంప్ స్పష్టం చేశారు.