Operation sindoor: ఆప‌రేష‌న్ సిందూర్ ఇంకా ముగియ‌లేదు.. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌ కీల‌క ప్ర‌క‌ట‌న

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య మూడు రోజుల‌పాటు కొన‌సాగిన ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు శ‌నివారం సాయంత్రం ముగింపు ప‌లికింది. అమెరికా దౌత్యంతో రెండు దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 
 

Google News Follow Us

ఆప‌రేష‌న్ సిందూర్ ఇంకా ముగియ‌లేద‌ని, ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలను కోరింది. 

తమకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్‌ సిందూర్‌ను అత్యంత నైపుణ్యంతో, కచ్చితంగా నిర్వహించామని భారత వాయుసేన వెల్లడించింది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ప్లాన్ చేసిన విధంగానే ఈ ఆపరేషన్ సాగిందని తెలిపింది.

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ ముగిసిందా? అనే అనుమానాలు వ‌స్తున్న త‌రుణంలో, వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తూ భారత వాయుసేన స్పందించింది. మిషన్ ముగిసినట్లు ఎక్కడా చెప్పలేదని, ఇంకా కొనసాగుతోందని తాము అధికారికంగా చెబుతున్నామని స్పష్టం చేసింది.

త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. కాగా, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్న ఊహాగానాలను, తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని భారత వాయుసేన విజ్ఞప్తి చేసింది.

Read more Articles on