మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల సామెతలను ఉపయోగిస్తుంటాం. పెద్ద పెద్ద వ్యాఖ్యాల్లో, పదాల్లో చెప్పలేని విషయాన్ని కూడా సామెతల ద్వారా సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి సామెతల్లో గాడిద గుడ్డు కంకర పీసు ఒకటి. అసలు ఈ సామెత ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.?
'గాడిద గుడ్డు' ఇది మనం నిత్యం ఉపయోగించే పదాల్లో ఒకటి. అంతెందుకు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తెలంగాణకు బీజేపీకి గాడిద గుడ్డు ఇచ్చిందంటూ చేసిన ప్రచారం ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. అయితే గాడిద అసలు గుడ్డు పెట్టదని తెలుసు. అలాంటప్పుడు ఈ గాడిద గుడ్డు ఎక్కడి నుంచి వంచిందబ్బా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.?
Story
అదే విధంగా 'గాడిద గుడ్డు కంకర పీసు' అనే సామెతను కూడా బాగా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఈ సామెత పుట్టడం వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిష్ దొర సముద్ర మార్గంలో భారత తీరానికి చేరుకుంటాడు. అయితే ఆ సమయంలో సముద్రంలో తుఫాను, పెను గాలులు వీస్తుంటాయి.
తీరానికి చేరుకున్న బ్రిటిష్ దొరను స్థానికంగా ఉన్న ఓ భారతీయుడు ప్రశ్నిస్తూ.. 'ఇంతటి తుఫాను, గాలి వానలో క్షేమంగా ఎలా చేరుకున్నారు దొర' అని ప్రశ్నిస్తాడు. అయితే తెలుగు రాని ఆ దొర మాట్లాడుతూ.. ఏముంది 'God the good conquered the pass' అని సమాధానం ఇస్తాడు. ఆ దేవుడే నన్ను క్షేమంగా గమ్యానికి చేర్చాడు అన్న అర్థం వచ్చేలా దొర ఈ పదాన్ని ఉపయోగిస్తాడు.
అయితే ఇంగ్లిష్ రాని ఆ వ్యక్తి దీనిని.. 'గాడిదగుడ్డు కంకరపీసు'గా అర్థం చేసుకున్నాడు. 'ఈ తుఫాను నన్నేమి చెయ్యగలదు గాడిదగుడ్డు కంకరపీసు' అని దొర చెప్పాడని భావిస్తాడు. దీంతో అప్పటి నుంచి ఈ సామెత ప్రాచుర్యంలోకి వచ్చిందని ఓ కథ చెబుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికీ ఈ సామెతను మనం వింటూనే ఉంటాం.