ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ) పై దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న సమయంలో జగన్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం పలు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. జగన్ ఆదేశాల మేరకు ఆ లేఖను డీఎంకే నాయకులకు వైవీ సుబ్బారెడ్డి లేఖను పంపించారు. ఈ లేఖలో జగన్ ప్రస్తావించిన పలు కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం సహా, ఆయా రాష్ట్రాల్లోని ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కాని, దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న ఊహ అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిథ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీమిలిటేషన్ అంశం విస్తృతస్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42, 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకేస్థాయిలో పలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారు.
కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. ఈ 15 సంవత్సరాల్లో మరింత తగ్గిందని మేం నమ్ముతున్నామని లేఖలో ప్రస్తావించారు. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గిందన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 20.88 శాతంగా ఉందనన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీని కోసం రాజ్యంపరంగా చేయాల్సిన సడలింపును కూడా ప్రధాని దృష్టికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీమిలిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలులో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదని లేఖలో పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహదపడుతుందని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు.