జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు..
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ.. 'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా, తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది' అని అన్నారు. అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని చెప్పారు, వందశాతం స్ట్రయిక్ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ చెప్పుకొచ్చారు. ఆడపడుచుల పోరాటస్ఫూర్తిని మరచిపోలేనని, ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు, వీరనారి గుణ్ణమ్మలు జనసేన ఆడపడుచులు, అందరి క్షేమం కాంక్షించే సూర్య దేవుని లేలేత కిరణాలు, తేడావస్తే కాల్చి ఖతం చేసే లేజర్ టీమ్‌లు జనసేన వీర మహిళలు అని పవన్ చెప్పుకొచ్చారు.
ఇక 2018లో పోరాట యాత్ర చేశామని, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశామన్నారు. ఓడిపోయినా అడుగు ముందుకు వేశామన్న పవన్, మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం, మనం నిలబడ్డామన్నారు. ఇక 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పుకొచ్చారు. అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదని పవన్ చెప్పుకొచ్చారు. తెలంగాణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్.. తెలంగాణ ప్రజలతో తన అనుబంధం చెరిగిపోదన్నారు. గద్దర్ వంటి గొప్ప నాయకునితో గడిపిన క్షణాలు చిరస్థాయిగా తన మనసులో నిలుస్తాయన్నారు పవన్.
2009లో ప్రజారాజ్యం ద్వారా తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్న పవన్. కానీ 2003లోనే నా తండ్రికి నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోనే కాదు, సమాజంలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ తనను గుర్తించి అభినందించినప్పుడు తనకు నిజమైన ప్రేరణ లభించిందని చెప్పుకొచ్చారు. ఇక సభలో సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన అభిమానులను ఉద్దేశిస్తూ.. "ఇక్కడ రాజకీయ పోరాటం కోసం వచ్చిన వాళ్లు ఉన్నారు. జనసైనికుల త్యాగాలను గౌరవించాలి. ఈ వేదికపై సినిమా విషయాలు ప్రస్తావించకూడదు" అని స్పష్టంగా పేర్కొన్నారు. 11 ఏళ్ల కష్టాన్ని పంచుకునే సమయంలో, అభిమానుల ప్రేమే తనకు మార్గదర్శకమని. జనసేనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు.