మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిలించిన విషయం తెలిసిందే. ఆకాశాన్ని అంటేలా ఉన్న పెద్ద పెద్ద భవంతులు పేక మేడళ్ల కూలిపోయాయి. భూకంపం ధాటికి వేలాది మంది మరణించారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే తరుణంలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి..
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం తీవ్ర నాశనాన్ని సృష్టించింది. ముఖ్యంగా మయన్మార్‌లో ఈ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ విపత్తుకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూకంపంలో భారీ ఎత్తున ముస్లింలు మరణించినట్లు మయన్మార్ ముస్లిం సంస్థ తాజాగా తెలిపింది.
శుక్రవారం, రంజాన్ ప్రార్థనల సమయంలో భూకంపం సంభవించడంతో 700 మందికి పైగా ముస్లింలు మసీదుల్లో శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ముస్లిం ఆర్గనైజేషన్‌లు వెల్లడించాయి. దాదాపు 60 మసీదులు ధ్వంసమైనట్లు మయన్మార్ ముస్లిం నెట్‌వర్క్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తున్ కీ సోమవారం తెలిపారు. అనేక మసీదులు దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రకృతి విలయానికి మొత్తం మృతుల సంఖ్య 1,700 దాటిందని మిలిటరీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 3,400 మందికి పైగా గాయపడగా, 300 మందికి పైగా ఇంకా శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో సహాయ చర్యలు మందగిస్తున్నాయి. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న కారణంగా సహాయ బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 28వ తేదీన సంభవించిన భూకంపం 334 అణు బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనాన్ని సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ అభిప్రాయాపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. సహాయక చర్యలు పూర్తయితే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.