అమెజాన్, ప్లిఫ్ కార్ట్ వేర్ హౌస్ లపై బిఐఎస్ దాడులు :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల వేర్ హౌస్ లపై దాడులు నిర్వహించింది. దేశంలో ఈ సంస్థలకు చెందిన చాలా గోదాంలలో సోదాలు జరిగాయి... ఇందులో నిబంధనలను ఉల్లంఘించి నాణ్యతలేని నాసిరకం వస్తువులను గుర్తించారు. దేశ రాజధాని డిల్లీతో సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనూ ఇటీవల బిఐఎస్ సోదాలు జరిగాయి.
డిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అమెజాన్ గోదాంలో దాదాపు 15 గంటలపాటు BIS అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వేలాదిగా ISI (ఇండియన్ స్టాండార్డ్ ఇన్స్టిట్యూట్) గుర్తింపులేని నాసిరకం విద్యుత్ ఉపకరణాలు, గీజర్లు, మిక్సర్లు వంటి గృహోపకరణాలు గుర్తించారు. అలాగే నకిలీ ఐఎస్ఐ స్టిక్కర్లు కలిగిన వస్తువులను కూడా అధికారులు గుర్తించారు.
ఇలా ఇటీవల డిల్లీలోని అమెజాన్ గోదాంలో నిర్వహించిన దాడుల్లో బిఐఎస్ అధికారులు 3,500 పైగా నాసిరకం వస్తువులను గుర్తించి జప్తు చేసినట్లు తెలుస్తోంది. వీటివిలువ దాదాపు రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వినియోగదారులను మోసం చేసేలా వ్యవహరిస్తున్న ఇ-కామర్స్ సంస్థలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని BIS అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల తమిళనాడులో కూడా ఇలాగే మరో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిక్ కార్ట్ గోదాంపై BIS దాడులు నిర్వహించింది. తిరువళ్లూరు జిల్లాలోని పుదవోయల్ లో గల అమెజాన్ గోదాంలో కూడా ఇలాగే ఐఎస్ఐ నిబంధనలు పాటించని 3,376 కు పైగా వస్తువులను జప్తు చేసారు. వీటివిలువ రూ.36 లక్షలు ఉంటుందని అంచనా.
ఇక కొడువల్లిలోని ఫ్లిప్ కార్ట్ గోదాంపై కూడా దాడులు నిర్వహించారు. ఇందులోనూ నిబంధనలు పాటించకుండా తయారుచేసిన వస్తువులను అమ్మకానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇలా అమెజాన్, ప్లిఫ్ కార్ట్ సంస్థల్లో వరుస దాడులు, అందులో నాసిరకం వస్తువులు గుర్తించడం వినియోగదారుల్లో ఆందోళన పెంచింది. ఈ సంస్థలపై నమ్మకంతో తాము వస్తువులు కొంటున్నామని... అలాంటిది ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముతుండటం ఏమిటని అంటున్నారు.