ప్రస్తుతం చాలామంది ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. 9 నుంచి 12 ఏళ్ల లోపే పీరియడ్స్ మొదలవుతున్నాయి. దీనికి కారణాలేంటి? ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒకప్పుడు అమ్మాయిలు 13, 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు 9 నుంచి 12 ఏళ్ల లోపే మెచ్యూర్ అవుతున్నారు. చాలా చిన్న వయసులోనే వారికి పీరియడ్స్ మొదలవుతున్నాయి. దీనికి కారణాలు, నివారణ మార్గాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.  

నిపుణుల అభిప్రాయం ప్రకారం...

ప్రస్తుతం చాలామంది పిల్లలు ఇంట్లో చేసిన ఫుడ్ కంటే బయట చేసిన ఫుడ్, జంక్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు. ఇది వాళ్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తోంది. బయట తయారుచేసిన ఆహారంలో హార్మోన్స్ ని ప్రభావితం చేసే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అమ్మాయిలకి చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలవుతున్నాయి. బరువు పెరగడానికి కూడా ఇదే కారణమవుతోంది. బరువు పెరగడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. బరువు, హార్మోన్ల అసమతుల్యత వల్ల చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తున్నాయి.   

మానసిక ఒత్తిడి, జీవనశైలి

ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చదువు, ఇతర విషయాల గురించి ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి కూడా హార్మోన్స్ ని ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్, కెమికల్స్ ఉన్న వస్తువులు వాడటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి చిన్న వయసులోనే పీరియడ్స్ రావొచ్చు.

వంశపారంపర్యం..

తల్లి లేదా అమ్మమ్మ.. చిన్న వయసులోనే మెచ్యూర్ అయితే.. కూతుళ్లకి కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది అమ్మాయిలకు ఇలా జరుగుతుంది కూడా.

దీన్ని వ్యాధిగా పరిగణించవచ్చా?

చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం వ్యాధి కాదు. కానీ 7-8 ఏళ్లకే మెచ్యూర్ అయితే మాత్రం దాన్ని వ్యాధిగా చెప్పవచ్చు. అలా అయినప్పుడు పిల్లలు చిన్న వయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. శరీరం, ఎముకలు, పెరుగుదల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

నివారణ మార్గాలు..

సరైన ఆహారం, మంచి జీవనశైలి పాటించాలి. పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలి. ఇంట్లో వండిన ఆహారం, పండ్లు, కూరగాయలు తినేలా చూడాలి. జంక్ ఫుడ్, బయట ఫుడ్ తినకుండా చూసుకోవాలి. పిల్లల మీద చదువు, ఇతర విషయాల గురించి ఒత్తిడి పెంచకూడదు. వాళ్లు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.