విశాఖపట్నం: వైసీపీ సర్కార్‌పై తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న(గురువారం) వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని.. అరాచక దినోత్సవమని వ్యంగ్యాస్త్రం సంధించారు. ముఖ్యంగా విశాఖకు చెందిన ఓ వైసిపి ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ అనిత్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యలను అనిత ఖండించారు. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు ముందుగా బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు. 

read more  పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం... ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు

వైసీపీ చేసే తప్పుడు పనులకు ‘సాక్షి’ కరపత్రంగా మారిందని విమర్శించారు. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అంటూ మహిళా మంత్రి టిక్‌టాక్‌లు చేసుకొనే కేబినెట్ ఇక్కడ ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇలా టిక్ టాక్ లతో కాలక్షేపం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారని... ముఖ్యమంత్రి ఎలా వున్నారో మంత్రులు  కూడా అలాగే వున్నారని విమర్శించారు.

స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ ప్రయత్నం చేస్తోందని... ఇదేం న్యాయమని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అంటే వైసీపీకి భయమని... అందుకే నామినేషన్‌లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

జగన్ 9 నెలల పాలనలో కనీసం 9 సామాజిక వర్గాలైనా సంతోషంగా ఉన్నాయా అని నిలదీశారు. ఓడిపోతామని తెలిసినా వర్ల రామయ్య హ్యాపీగా రాజ్యసభకు పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీటీడీ బోర్డులో ఒక దళితుడు కూడా లేడని... దళితులకు వైసీపీ అన్యాయం చేసిందన్నారు. దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై,  అధికార పార్టీయే సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. 

read more  ఏపిలో కరోనా కలకలం... నెల్లూరులో పాజిటివ్... మరో ఐదుగురికి అనుమానం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సాహిస్తున్నారని...వారు  చేస్తున్న అరాచక పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అరాచకాలను ఆపేసి ప్రజలకు మంచి పాలన అందించాలని  సూచించారు.