విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణ, భద్రత కోసం రూపొందించిన దిశా యాప్ ను ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్ ను ఉపయోగించిన ఓ మహిళా గ్రామ వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఓ మహిళా గ్రామ వాలంటీర్ ను భర్త నిత్యం వేధించేవాడు. ఇంతకాలం అతడి చిత్రహింసలను భరిస్తూ వచ్చిన ఆమెకు దిశ చట్టం ఓ భరోసాను ఇచ్చింది. దీంతో భర్తపై దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 ఫిర్యాదుపై స్పందించి స్థానిక పోలీసులు రాత్రి సమయంలో కూడా కేవలం పది నిమిషాల్లోనే సదరు గ్రామ వాలంటీర్ ఇంటికి చేరుకున్నారు. భార్యాభర్తల సమస్య కాబట్టి ఇద్దరికి నచ్చజెప్పారు. భార్యను హింసించవద్దంటూ భర్తకు గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు.

read more  దిశ యాప్ పై మహిళా నేతలతో చంద్రబాబు కుట్ర: రోజా   

మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాప్ తొలి సక్సెస్‌ను ఇటీవలే పోలీస్ వర్గాలు అందుకున్నాయి. బస్సులో మహిళను వేధిస్తున్న కీచకుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో తొటి మహిళా అధికారి పట్ల ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు ఇటీవల ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశా యాప్ గుర్తొచ్చి.. SOS ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

ఉదయం 4.21 నిమిషాలకు మంగళగిరిలోని దిశా కాల్ సెంటర్‌కు SOS కాల్ వెళ్లింది. అక్కడి నుంచి దగ్గరలోని అత్యవసర విభాగానికి ఫోన్ వెళ్లింది. క్షణాల్లో రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాల కల్లా అంటే కేవలం 6 నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు చేరుకున్నారు.

బస్సులో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అనంతరం ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు.

read more  విశాఖలో ఐదేళ్ల బాలికపై రేప్: నిందితుడు అరెస్ట్

 సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. మరోవైపు మహిళలు-బాలికల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడంతో పాటు దిశ పోలీస్ స్టేషన్లను సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే.