తెలంగాణ రైతుల కోసమే ప్రత్యేక కాల్ సెంటర్... ప్రారంభించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా కాల్ సెంటర్ ను ఏర్పాటుచేసింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్: రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా కాల్ సెంటర్ ను ఏర్పాటుచేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునేందుకు రైతులకు ఈ కాల్ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా వుంటుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో రైతుభీమాకు సంబంధించిన వివరాలను కాల్ సెంటర్ నుండి మాట్లాడి తెలుసుకున్నారు మంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రైతుభీమా ద్వారా అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి యధావిధిగా విడుదల చేయడం జరుగుతుందని... ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారని మంత్రి తెలిపారు.