కేటీఆర్ దొర... నిన్ను ఓడించి రిటర్న్ గిప్ట్ ఇస్తాం: సిరిసిల్లలో ప్లెక్సీల కలకలం


సిరిసిల్ల : సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది.

First Published Dec 20, 2022, 12:51 PM IST | Last Updated Dec 20, 2022, 12:51 PM IST


సిరిసిల్ల : సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించాలంటూ మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిసారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో, ఎంపిడివో కార్యాలయాల వద్ద కేటీఆర్ ఫోటోలతో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోసకారి కేటీఆర్ అంటూ ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థుల పేరిట ప్లేక్సీలు వెలిసారు. ఇలా విద్యార్థులకు ద్రోహం చేసిన మంత్రి కేటీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ సెస్ అభ్యర్థిని ఓడించి రిటర్న్ గిప్ట్ ఇస్తాం... మోసం చేసిన కేటీఆర్ కు తగిన బుద్ది చెబుతామంటూ హెచ్చరించారు. 

 డిగ్రీ కాలేజీ ఏర్పాటు మరిచిపోవడంతో బడుగు బలహీన, గిరిజన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు... మా గోస నీ పార్టీకి, ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అంటూ ప్లెక్సీలో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల ప్రజలారా మీ సమస్యలు తీరాలంటే సెస్ టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని సూచించారు. ఓ కేటీఆర్ దొర నిన్ను కూడా త్వరలోనే ఓడిస్తామంటూ ప్లెక్సీ సాక్షిగా హెచ్చరించారు.