Asianet News TeluguAsianet News Telugu

లండన్‌లో తెలుగు విద్యార్థులను ఆదుకున్న తాల్


కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. 

కరోనా వైరస్‌‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీంతో విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దేశం కానీ దేశంలో మనవాళ్లు ఇబ్బందులు  పడుతున్నారు. వీరి అవస్థలపై స్పందించిన అక్కడి ఎన్ఆర్ఐలు.. భారతీయ విద్యార్ధులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కిరాణా సామాగ్రిని అందజేశారు. గురువారం ఈస్ట్ లండన్‌లో తాల్ ప్రతినిధులు రవి మోచర్ల, సత్యేంద్ర పగడాల ఆధ్వర్యంలోని వాలంటీర్లు వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్ధులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. శరవన్ భవన్ అధినేతలు శివకుమార్, రేఖ విక్కీ, శక్తి స్టోర్స్ అధినేత సురేశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న తాల్ ప్రతినిధులకు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్ధితుల్లో ఇలాంటి సాయాలు అందించడానికి తాల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. కేవలం తెలుగు విద్యార్ధులకే కాకుండా, అంతర్జాతీయ విద్యార్ధులకు కూడా తోడ్పాటును అందించినట్లు తాల్ ఛైర్మన్ సోమిశెట్టి శ్రీధర్ తెలిపారు.