Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు ఉచిత సలహాలొద్దు... గౌరవాన్ని కాపాడుకొండి : తండ్రికి వసంత కృష్ణప్రసాద్ చురకలు

విజయవాడ : జగ్గయ్యపేటలో కమ్మ సంఘం కార్తీక వనభోజన కార్యక్రమంలో తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు.

విజయవాడ : జగ్గయ్యపేటలో కమ్మ సంఘం కార్తీక వనభోజన కార్యక్రమంలో తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. కమ్మ సామాజికవర్గానికి వైసిపి ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతోందన్న తన తండ్రి మాటలతో ఏకీభవించడం లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడం, రాజధాని అమరావతి నుండి తరలించడం, కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గురించి తన తండ్రి మాట్లాడారన్నారు. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించారని మాట్లాడేవారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు... అప్పుడు మాట్లాడని వారికి ఇప్పుడు విమర్శించే హక్కు ఎక్కడిదన్నారు. ఇక రాజధాని విషయంలో పార్టీ, జగన్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. మంత్రి పదవులు ఎవరికివ్వాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలన్నదానిపై జగన్ కు అవగాహన వుందన్నారు. మంత్రి పదవుల గురించి జగన్ కు ఉచిత సలహాలొద్దంటూ తండ్రి నాగేశ్వరరావుకు కృష్ణప్రసాద్ చురకలు అంటించారు. తన తండ్రి రాజకీయాల నుండి రిటైరయ్యారు... ప్రస్తుతం ఆయన సొంతంగా నడిచే పరిస్థితి కూడా లేదు... బాత్రూంకు తీసుకుని వెళ్లాలన్నా ఎవరో ఒకరి సహాయం తీసుకోవాలని కృష్ణప్రసాద్ అన్నారు. ఇలాంటి సమయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా తన గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలన్నారు. వసంత నాగేశ్వరరావు నోటికి తాళం వేయలేమని... నోటికి ఎదొస్తే అది మాట్లాడేవారని వైఎస్సార్ అనేవారని... వాగే నోరు, తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రి వ్యవహారం వుందన్నారు. మా నాన్న నోటితో చాలా ప్రమాదకరం... ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం... అందుకే మైలవరంలో జరిగే ఏ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించడం లేదన్నారు. బాధ్యతాయుతంగా మెలగాలని తండ్రిని కోరారు వసంత కృష్ణప్రసాద్.