విశాఖలో దారుణం... విషవాయువులు లీకై ఎక్కడికక్కడ కుప్పకూలిన మహిళలు
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపనీలో విషవాయువులు లీకై పలువురు మహిళలు కంపనీలోనే కుప్పకూలారు. ఇలా దాదాపు 50 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కంపనీ యాజమాన్యం వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. వాంతులు, వికారంతో పాటు కొందరు మహిళలు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ రెడ్డి కమీషన్ల కోసం విశాఖను విషాదపట్నంగా మార్చారని ఆరోపించారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుందన్నారు. ప్రజల ప్రాణాలంటే వైసిపి ప్రభుత్వానికి లెక్కే లేదన్నారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కమీషన్లు అందితే చాలన్నట్లుగా వుంది జగన్ తీరు వుందన్నారు. చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు... బతికేలా రక్షణ చర్యలు తీసుకోండని సీఎం జగన్ ను లోకేష్ కోరారు.