టిడిపి 'ఛలో కంతేరు' ఉద్రిక్తత ... మాజీ మంత్రులు ఆనంద్ బాబు, దేవినేని ఉమ హౌస్ అరెస్ట్
గుంటూరు జిల్లా తాడికొండలో ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మతో పాటు ఆమె కుమారుడిపై అధికార పక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు.
గుంటూరు జిల్లా తాడికొండలో ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మతో పాటు ఆమె కుమారుడిపై అధికార పక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపైనా ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే వైసిపి శ్రేణులు దాడికి యత్నించారు. ఈ దాడులను ఖండిస్తూ టిడిపి అదినేత నారా చంద్రబాబు నాయుడు "ఛలో కంతేరు" కు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కంతేరులో భారీగా పోలీస్ బలగాలను మొహరించిన పోలీసులు టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమైన మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వర రావుని ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కంతేరుకు వెళుతున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఇతర నాయకులను తాడేపల్లి బైపాస్ లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.