Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: ఇందిరా బాటలో సోనియా.. కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్.. చంద్రబాబు-పవన్ భేటీ..

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్.. మద్దతుగా నిలిచిన యంగ్ హీరో..  అవినీతి తిమింగలం శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు, ఇందిరా గాంధీ బాటలో సోనియా గాంధీ , గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్.., నేడే  జగన్ కేబినెట్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివేనా..?, ఐదో జాబితాపై జగన్ కసరత్తు, నేడు చంద్రబాబు- పవన్ భేటీ .. సీట్ల పంపకాలపై క్లారిటీ, జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సతీమతి?, రాందేవ్ బాబాకు అరుదైన గౌరవం.. న్యూయార్క్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం, మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్ .. మరో సంచలనానికి ఎలాన్ మస్క్ శ్రీకారం..,ఐసీయూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్ వంటి వార్తల సమాహారం. 

today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana headlines krj
Author
First Published Jan 31, 2024, 7:41 AM IST

Today Top Stories: ఇందిరా గాంధీ బాటలో సోనియా గాంధీ  

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని.. అప్పుడే తెలంగాణ ప్రజలకు ఇక్కడి పార్టీలు గౌరవం ఇచ్చినట్లని సీఎం అన్నారు. సోనియమ్మ నామినేషన్ వేసిన తర్వాత.. ఆమె మీద తెలంగాణ బిడ్డలెవరూ పోటీ చేస్తారని తాము అనుకోవడం లేదన్నారు. సోనియా తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అంతా సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై  యథాతథస్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల  8వ తేదీ వరకు  యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్,  అమీర్ అలీఖాన్ ల పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రభుత్వ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు నిన్ననే ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ  మండలి చైర్మెన్ అందుబాటులో లేని కారణంగా  ఈ కార్యక్రమం జరగలేదు. ఇవాళ వీరిద్దరూ  ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ తరుణంలో హైకోర్టు  నిర్ణయం వెలువడింది. దీంతో  కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల ప్రమాణానికి బ్రేక్ పడింది.   తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు  గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

నేడే  జగన్ కేబినెట్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివేనా..? 

AP cabinet meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ కీలక సమావేశంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని APSRTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తే..  2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను సమర్సించే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో ప్రభుత్వం  చేసే వ్యయంపై ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పథకాన్ని కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్.. మద్దతుగా నిలిచిన యంగ్ హీరో..  

Kumari Aunty: ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కుమారి ఆంటీకు కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయనీ, దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చిచెప్పేశారు. ఇలా చేయడం అన్యాయమంటూ.. పలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై హీరో సందీప్ కిషన్ స్పందించాడు. ఆయన ట్విట్టర్ వేదికగా కుమారి ఆంటీ కి మద్దతు తెలిపారు. ఆమెకు అండగా నిలుస్తూ.. పోలీసులు ఇలా చేయడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు.

అవినీతి తిమింగలం శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ దాన కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఘటనలో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్‌మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. వారిలో కొందరు ఏసీబీలో సైతం ఫిర్యాదు చేయడం గమనార్హం. 

ఐదో జాబితాపై జగన్ కసరత్తు

YSRCP: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహారచన చేస్తున్నారు. ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు  పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జీలను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చేశారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిచించారు. 

ప్రధాని మోదీకి  వైఎస్ షర్మిల లేఖ.. 

YS Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేంద్రంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి  వైఎస్ షర్మిల మంగళవారం నాడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును జాతీయ నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రకటించడం, కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం వంటి ఎనిమిది హామీలను ఏపీసీసీ అధ్యక్షుడు లేఖలో పేర్కొన్నారు.  నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు. ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని షర్మిల నిలదీశారు. 

నేడు చంద్రబాబు- పవన్ భేటీ .. సీట్ల పంపకాలపై క్లారిటీ 

TDP Janasena : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ సింగల్ గా బరిలో దిగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ- జనసేనలు మాత్రం ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. కానీ.. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలపై మాత్రం క్లారటీ రాలేదు. ఈ తరుణంలో ఆ పొత్తుల లెక్కలను ఓ కొలిక్కి వచ్చేందుకు ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు ( బుధవారం) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్టు సమాచారం. 

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సతీమతి?

Hemanth Soren: జార్ఖండ్ సీఎం మిస్సింగ్ అంటూ కథనాలు వచ్చాయి. ఆయన కొద్దికాలం ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఆయన కొంతకాలం మిస్సింగ్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఇంతలోనే మళ్లీ అనూహ్యంగా ఆయన రాంచీలో ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో జార్ఖండ్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందా? హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు తీసుకుంటారా? జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్ పగ్గాలు తీసుకుంటారా? అనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈడీ అధికారులు సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేస్తే మాత్రం కల్పనా సోరెన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది.

రాందేవ్ బాబాకు అరుదైన గౌరవం..

RAMBEV BABA: ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం టైమ్స్ స్క్వేర్ నడిబొడ్డున ఉంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి సాధువు బాబా రాందేవ్ కావడం విశేషం.విగ్రహాన్నిఢిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్ .. 
 
Elon Musk: శాస్ర్త సాంకేతిక రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్. తన న్యూరాలింక్ సంస్థ తాజాగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చింది. ఈ క్రమంలో మెదడులో చిప్ ను అమర్చే తొలి పరీక్ష విజయవంతమైందని ఎలోన్ మస్క్ ప్రకటించారు. చిప్‌ను అమర్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని మస్క్ చెప్పారు. మస్క్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు.

ఐసీయూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్

Mayank Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ గురించి కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్ణాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్‌ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది.  విమానం టేకాఫ్ కాకముందే ఈ  ప్రమాదం జరగడంతో అతడ్ని హుటాహూటిన అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల కారణాలు సరిగా తెలియరావడం లేదు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios