Asianet News TeluguAsianet News Telugu

లోన్ తీసుకొని ఎర్త్ మూవర్స్ కొనుగోలు.. రెట్టింపు ధరతో ఆఫ్రికాకు అమ్మేసి.. ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చుటోపి..

ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేస్తామని ఆ వ్యాపారులు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నారు. తరువాత ఆ లోన్లను ఎగవేశారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఆ పరికరాలను రికవరీ చేసుకుందామని వెళ్లి షాక్ అయ్యారు. వాటిని ఎప్పుడో ఆఫ్రికాకు ఎగుమతి చేశారని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

The traders who took a loan and bought earth movers.. sold them to Africa at double the price.. cheated the finance companies..ISR
Author
First Published Aug 30, 2023, 10:48 AM IST

తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని 22 ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేశారు. అనంతరం వాటిని రెట్టింపు ధరకు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారు. అనంతరం లోన్లు కట్టకుండా ఆ ఫైనాన్స్ కంపెనీను మోసం చేశారు. దీనిపై పోలీసులకు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆ మోసగాళ్లపై అలాంటి ఆరోపణలు చేస్తూ ఓ బ్యాంకు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి మరో రెండు ఫిర్యాదులు అందాయి. 

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. పలువురు వ్యాపారులు భవన నిర్మాణ పరికరాలు కొనుగోలు చేసేందుకు గత రెండేళ్లలో రూ.28 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు రుణాలు పొంది, వాటిని ఎగవేశారు. అయితే రికవరీ చేద్దామంటే సుమారు రూ.10 కోట్ల విలువైన ఆ యంత్రాల ఆచూకీ లభించడం లేదు. ఈ వాహనాలు ఆఫ్రికాకు ఎగుమతి అయ్యాయని తెలుస్తోంది. వాస్తవానికి అందులో ఎన్ని ఎగుమతి అయ్యాయి ? దానికి ఎలా అనుమతి లభించిందో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు కేంద్ర సంస్థల నుంచి సహాయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.

హైదరాబాద్, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్ నగర్, కడ్తాల్, తాండూరు, వరంగల్, సిద్దిపేటకు చెందిన 22 మంది వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధి జూలై 14న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘మా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)కి తాకట్టు పెట్టిన నిర్మాణ పరికరాలను అక్రమంగా ఎగుమతి చేశారు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు 22 ఎర్త్ మూవర్లు, ఎక్స్ వేటర్ల కొనుగోలు కోసం 2022లో రూ.7.22 కోట్ల రుణం తీసుకున్నారని అందులో తెలిపారు. నిందితులు, వారి మధ్యవర్తులు రాకెట్ గా ఏర్పడి సముద్ర మార్గాల ద్వారా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా నిర్మాణ సామగ్రిని ఎగుమతి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిర్మాణ సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సహాయం కోరుతూ వారు టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ ను సంప్రదించగా రుణం మంజూరైందని, కానీ వారు లోన్లు ఎగవేతదారులుగా మారారని తెలిపారు. అయితే రుణాలు మంజూరు చేసిన పరికరాలను రికవరీ చేద్దామంటే అవి కనిపించడం లేదని పేర్కొన్నారు. 

కాగా.. ఈ నిర్మాణ పరికరాలను స్మగ్లింగ్ చేయడానికి ఎగుమతి లైసెన్స్ కంపెనీ ముందు వరుసలో ఉండి వ్యవహారం నడిపిందని ఫైనాన్స్ కంపెనీ బృందం జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. ఆఫ్రికా దేశాలకు అక్రమంగా నిర్మాణ సామగ్రిని ఎగుమతి చేయడం వల్ల స్థానికంగా కొనుగోలు ధర కంటే రెట్టింపు ధర వస్తుంది. గత ఏడాది కాలంలో వేలాది నిర్మాణ పరికరాలను అక్రమంగా ఎగుమతి చేశారని, ఫలితంగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, జాతీయ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని సీసీఎస్ అధికారి ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కు తెలిపారు. 

అయితే మొదటి ఫిర్యాదును అర్థం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలోనే.. పరికరాల కొనుగోలు కోసం రూ .57.9 లక్షల రుణం పొందిన ఐదుగురు వ్యక్తులపై కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి నుండి జూలై 20 న రెండో ఫిర్యాదు వచ్చింది. నిందితులు రుణ చెల్లింపులు చేయకపోవడంతో తాకట్టు పెట్టిన వాహనాలను చూపించాలని బ్యాంకు అధికారులు రుణ గ్రహీతలను కోరుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. 

అలాగే పోలీసులకు జూలై 25వ తేదీన మరో ఫిర్యాదు అందింది. భవన నిర్మాణ సామగ్రి కొనుగోలు కోసం రుణం పొంది, ఆ తర్వాత రుణ చెల్లింపుల్లో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఐదుగురు నిందితులపై హెచ్ బీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధి మూడో ఫిర్యాదు చేశారు. మోటారు వాహన చట్టం లేదా మరే ఇతర చట్టం పరిధిలోకి రాని నిర్మాణ పరికరాలను నేరస్తులు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని, చట్టంలోని లొసుగులను వారు చక్కగా ఉపయోగించుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios