హైదరాబాద్: విదేశీ యువతుల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మరొకరిని అరెస్టు చేసింది. సలాం భార్య బంగ్లాదేశ్ జాతీయురాలు శివులు ఖటూన్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఖటూన్ 2012లో దేశంలోకి చొరబడినట్లు ఎన్ఐఎ గుర్తించింది. 

ఆమె బంగ్లాదేశం నుంచి యువతులను అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె చెరలో ఉన్న ముగ్గురు యువతులకు ఎన్ఐఎ అధికారులు విముక్తి కలిగించారు. బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా సరిహద్దులు దాటిస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తున్న విషయం ఎన్ఐఎ కనిపెట్టింది. 

బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గంలో సరిహద్దులు దాటిస్తూ భారతదేశంలోని వ్యభిచార గృహాలకు యువతులను చేరవేస్తున్న వ్యవహారంలో రుహుల్ అమిన్ దాలి (52)ని శుక్రవారం ఎన్ఐఎ అరెస్టు చేసింది. 

పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బసీరత్ పట్టణంలో ఎన్ఐఏ రుహుల్ ను అరెస్టు చేసింది. అతని నుంచి 11 బంగ్లాదేశ్ కు చెందిన 11 సిమ్ కార్డులు, పదివేల రూపాయల నగదు, వ్యభిచార గృహాల నిర్వాహకుల నెంబర్లు ఉన్న డైరీనీ స్వాధీనం చేసుకున్నారు. 

ఏప్రిల్ 21వ తేదీన హైదరాబాదు పాతబస్తీ ఛత్రినాకా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై స్థానిక పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో పోలీసులకు పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు నిర్వాహకులు మహ్మద్ యూసుఫ్ ఖాన్, అతడి భార్య బితిబేగం, సోజిబ్ దొరికారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ వ్యభిచార ముఠా పాత్ర ఉన్నట్లు తేలడంతో కేసును ఎన్ఐఏకు అప్పగించారు.