హైదరాబాద్ నిమ్స్‌లో సమ్మెకు దిగిన నర్సులు.. ఆగిన ఆపరేషన్లు..
Hyderabad: తమ సమస్యలను ఆసుపత్రి అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నర్సులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి డైరెక్టర్ తమకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తమకు అధిక పనిభారం ఏర్పడిందని నర్సులు ఆరోపించారు.

Nurses go on strike at NIMS: గత కొంత కాలంగా తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువస్తున్న పట్టించుకోవడంలేదని పేర్కొంటూ నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) నర్సులు ఆందోళనకు దిగారు. ఆకస్మికంగా సమ్మెకు దిగి నిరసన తెలుపడంతో ఆస్పత్రిలో ఆపరేషన్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఆరోగ్య సేవల్లో అంతరాయం ఏర్పడింది.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) ఇన్ చార్జి డైరెక్టర్ వేధింపులకు నిరసనగా నర్సులు ఆకస్మిక సమ్మెకు దిగారు. అదనపు డ్యూటీలు కేటాయించి అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ నర్సులు సోమవారం రాత్రి నుంచి విధులను బహిష్కరించారు. తమ సమస్యలను ఆసుపత్రి అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఇన్చార్జి డైరెక్టర్ తమకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తమకు అధిక పనిభారం ఏర్పడిందని నర్సులు ఆరోపించారు.
నర్సుల ఆకస్మిక సమ్మె ఆరోగ్య సేవలపై ప్రభావం చూపింది. విధులు బహిష్కరించడంతో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ సేవలు దెబ్బతిన్నాయి. నర్సుల సమ్మె ఫలితంగా వైద్యులు శస్త్రచికిత్సలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సమ్మె చేస్తున్న నర్సులతో వారి డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది.