Hyderabad Crime: అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిల గొడవ... కత్తితో దాడిచేసి హత్యాయత్నం
ఓ అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ మహానగరంలో చోటుచేసకుంది.
హైదరాబాద్: ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యాయత్నానికి దారితీసింది. మాట్లాడుకుందామని పిలిచి ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడిచేసిన ఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన కోఠిలో నివాసముండే నాందేవ్ (22) అనే యువకుడు శుభకార్యాలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఇతడికి నింబోలి అడ్డాలో నివాసముండే శ్రీకాంత్ (22) అనే మరో యువకుడితో ఓ అమ్మాయి విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఫోన్ లో మాటామాటా పెరిగి శతృత్వం ఏర్పడింది.
మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకుందామని చెప్పి ఈ ఇద్దరు యువకుడు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఫోన్ చేసి ఇసామియా బజార్ కు రావాలని నాందేవ్ ను పిలిచాడు. ఇలా మాట్లాడుకుందామని కలుసుకున్న యువకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా నాందేవ్ పై దాడికి దిగాడు శ్రీకాంత్. ఈ దాడి నుండి తప్పించుకోడానికి చేయి అడ్డుపెట్టుకోవడంతో ఈ కత్తి చేతిని చీల్చింది.
ఇలా రోడ్డుపైనే ఇద్దరు యువకులు గొడవపడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన నాందేవ్ ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. నిందితుడు శ్రీకాంత్ దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో పరువుహత్యలు కలకలం సృష్టించాయి. సరూర్ నగర్ లో మతాంతర వివాహాం చేసుకున్న నాగరాజును సరూర్ నగర్ లో నడిరోడ్డుపై నరికిచంపిన ఘటన మరువకముందే బేగంబజార్ లో అలాంటి దారుణమే చోటుచేసుకుంది. బేగంబజార్ చేపల మార్కెట్ సమీపంలో ఒక యువ వ్యాపారి హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆయనను అంతమొందించిన్నట్లు పోలీసులు గుర్తించారు.
బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్ కుమార్ పన్వార్ (22) పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు నీరజ్ మీద ఇంకా కక్షపెంచుకున్నట్లు తెలుస్తోంది. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని అదును కోసం ఎదురుచూసి ఇటీవల అతికిరాతకంగా చంపాడు.
ఈ క్రమంలోనే పనిపై బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు. కిందపడిపోయిన నీరజ్ ను కొబ్బరిబోండాల కత్తితో అతి దారుణంగా నరిపిచంపి పరారయ్యారు. రక్తపు మడుగులో పడివున్న నీరజ్ పన్వార్ ను వెంటనే షాహీనాయత్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నీరజ్ ను చంపిన ఐదుగురిని ఘటనాస్థలానికి సమీపంలోకి వ్యాపారకేంద్రాల వద్దగల సీసీ కెమెరా ఫుటేజి దృశ్యాలను పరిశీలించి గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసారు.