హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపించిన మిర్యాలగుడా యువతి మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసు పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. తనపై 139 మంది 9 ఏళ్ల పాటు అత్యాచారం చేశారని ఓ యువతి హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె మాట మార్చి తన ఫిర్యాదులో చెప్పిన పేర్లలో కొంత మంది తనపై అత్యాచారం చేయలేదని, డాలర్ బాయ్ ప్రోద్బలంతో సెలబ్రిటీల పేర్లు చేర్చానని ఇటీవల చెప్పింది. తాజాగా మరోసారి మాట మార్చింది. 

గురువారం తాజాగా ఆమె మరో ప్రకటన చేసింది. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. మొత్తం 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు చెప్పింది. రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ తనను చిత్రహింసలకు గురి చేశాడని, అతని బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చేర్చాల్సి వచ్చిందని చెప్పింది.

డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం కోసం తాను వెళ్లానని, అప్పటి నుంచి తన గురించి తెలుసుకుని డాలర్ బాయ్ ఈ విధంగా వాడుకున్నాడని చెప్పింది. మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్ బాయ్ మీద సీసీఎస్ మహిలా పోలీసు స్టేషన్ లో ఇది వరకే ఓ కేసు నమోదైంది. అయితే, అప్పుడు బాధితురాలు చెప్పిన విషయాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలకు మధ్య చాలా తేడా ఉంది. దీంతో మరోసారి బాధితురాలి వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయాలని కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు అనుకుంటున్నారు.