హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య కేసులో నిందితుల కాల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశ కేసు నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.

తమ పవన్ కల్యాణ్ పోరాటం చేయడం వల్లనే దిశ ను రేప్ చేసి, హత్య చేసినవారిని వాళ్లను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వారు అంటున్నారు. తమ నేత పోరాటం వల్లనే నిందితులు ఎన్ కౌంటర్ అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ చిత్రపటం పెట్టి, ఆయనకు 101 కొబ్బరికాయలు కొట్టారు.

పవన్ కల్యాణ్ పోరాటం వల్లనే దిశ కేసు నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారని అంటూ వారు పవన్ కల్యాణ్ కు 101 కొబ్బరి కాయలు కొట్టిన దృశ్యాలను, ఆ తర్వాత తాము మాట్లాడిన వీడియో దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగినట్లు తెలుస్తోంది.

దిశ రేప్, హత్య కేసు నిందితులు చటాన్ పల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున  పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అయితే, దిశ ఘటనను ప్రస్తావిస్తూ రేప్ చేసినవారిని నడిబజారులో బెత్తంతో తోలు ఊడిపోయేలా కొడితే సరిపోతుందని అంతకు ముందు అన్నారు. దీనిపై అన్ని వైపుల నుంచీ విమర్శలు వచ్చాయి.