Asianet News TeluguAsianet News Telugu

అమ్నేషియా పబ్ రేప్ కేసు: నిందితుల మొబైల్‌ ఫోన్ల నుంచి డేటాను రికవరీ చేయలేకపోతున్న పోలీసులు..!

జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు.. నిందితుల ఫోన్‌ల నుంచి డేటాను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. 

Jubilee Hills gangrape case Police unable to retrieve data from accused mobile phones
Author
First Published Sep 6, 2022, 11:08 AM IST

జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అమ్నేషియా పబ్ వద్ద నుంచి బాలికను ఇంటివద్ద దింపుతామని చెప్పిన నిందితులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు.. నిందితుల ఫోన్‌ల నుంచి డేటాను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. బాలికపై అత్యాచారం జరుపుతున్న దృశ్యాలను నిందితులు వారి ఫోన్లలో వీడియా రికార్డు చేసిన నేపథ్యంలో.. పోలీసులు వారి ఫోన్‌ల నుంచి డేటాను సేకరించేందుకు యత్నిస్తున్నారు. 

ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతకుముందే నిందితులు  వారి ఫోన్లలోని డేటాను ధ్వంసం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ డెక్కన్ క్రానికల్ రిపోర్టు చేసింది. కారులో జరిగిన నేరానికి సంబంధించిన పూర్తి వీడియోను నిందితులు ఫోన్‌లలో నుంచి తొలగించారు.  

Also Read: అమ్నేషియా పబ్ రేప్ కేసు : ఆ లెవల్స్ ఎక్కువున్నాయ్.. వాళ్లు మైనర్లు కారు, మేజర్లే .. కోర్టులో పోలీసుల పిటిషన్

అయితే ఆరుగురు నిందితుల్లో మేజర్‌గా ఉన్న సాదుద్దీన్ మాలిక్.. ఇతర నిందితులకు వారి మొబైల్ ఫోన్‌లను ధ్వంసం చేయమని సలహా ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సాంకేతిక నిపుణుల ప్రకారం.. డేటాను తిరిగి పొందలేమని తెలిసినందున పోలీసులు ధ్వంసమైన మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ పరిశోధనల కోసం పంపలేదని తెలుస్తోంది. అయితే.. నిందితులు బాధితురాలిపై నేరానికి పాల్పడుతున్ చిన్నపాటి క్లిప్‌లను పోలీసులు సేకరించగలిగారు.

ఈ ఘటన జరిగిన తర్వాత.. నిందితులు బాలికపై అత్యాచారానికి సంబంధించిన కొన్ని వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లిప్‌లను పోలీసులు సోషల్ మీడియా నుంచి తొలగించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బాలిక ఐడెంటిటీ రివీల్ చేయకుండా కొన్ని వీడియోలను ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

ఇక, ఈ కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు తెలంగాణ హైకోర్టు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios